నడిగూడెం, మార్చి 25. నేటి తెలుగు పత్రిక: నడిగూడెం మండల శాఖ ఆధ్వర్యంలో పెన్షనర్ల హక్కులకు తీవ్రమైన విఘాతం కలిగించే వ్యాలిడేషన్ యాక్ట్ ను రద్దు చేయాలని కోరుతూ భారత ప్రధానమంత్రి కి నడిగూడెం మండల తహసిల్దార్ శ్రీ బి. రామకృష్ణారెడ్డి గారి ద్వారా మెమోరాండం సమర్పించారు.. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మండల పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు శ్రీ యం డి. ఖలీల్ అహ్మద్ వాల్యుయేషన్ యాక్ట్ ఏ విధంగా పెన్షనర్లను ఆందోళనకు గురిచేస్తుందో వివరించారు.తమ జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం గౌరవప్రదమైన జీవితం గడపడానికి పెన్షన్ ప్రధాన ఆధారం. అయితే ఇటీవలి పరిణామాలు దేశవ్యాప్తంగా పెన్షనర్లలో ఆందోళన కలిగిస్తున్నాయనీ, ముఖ్యంగా వాలిడేషన్ చట్టం ప్రవేశపెట్టడం, పెన్షన్ ప్రయోజనాలపై పరిమితులు విధించే ప్రయత్నాలు, పెన్షనర్ల మధ్య వర్గీకరణ వంటి అంశాలు పెన్షనర్లలో ఆందోళనకు కారణం అవుతున్నాయనీ, ఈ పరిస్థితుల్లో పెన్షనర్ల హక్కులను కాపాడుకోవడం అత్యవసరం అని ఆయన తెలిపారు. అఖిల భారత పెన్షనర్ల సమాఖ్య పిలుపు మేరకు మార్చి 25న ‘బ్లాక్ డే’గా పాటించామని,ఈ నిరసన కార్యక్రమం దేశమంతటా పెన్షనర్ల ఐక్యతకు ప్రతీకయనీ, ఈ రోజు నడిగూడెం మండల పెన్షనర్లు నిరసన బ్యాడ్జ్‌లు ధరించి, తాసిల్దార్ కు వినతిపత్రాలు అందజేస్తూ, భారత ప్రధానమంత్రికి తమ ఆవేదనను పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో తెలియజేయడం జరిగిందన్నారు. పెన్షన్ అనేది ప్రభుత్వమిచ్చే దానం కాదు. అది ఉద్యోగి తన సేవా కాలంలో సంపాదించిన వాయిదా పడిన జీతం. వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు, వైద్య ఖర్చులు పెరుగుతాయి. అటువంటి సమయంలో పెన్షన్ ఒక ముఖ్యమైన జీవనాధారం అవుతుంది.
అందువల్ల పెన్షన్ హక్కులను తగ్గించే లేదా పరిమితం చేసే చర్యలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు పెన్షనర్ ల హక్కుల విషయంలో సుప్రీంకోర్టు ఇప్పటికే నకారా జడ్జిమెంట్ ద్వారా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీ జి.అనంత రాములు మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన ఉద్యోగులను 2026 జనవరి 1కి ముందు, ఆ తర్వాత పదవీ విరమణ చేసిన వారుగా విభజించి, వర్గీకరణ చేయడం ద్వారా 7వ వేతన సవరణ సంఘం ప్రయోజనాలను పరిమితం చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నం, సహజ న్యాయ, సమానత్వ సూత్రానికి విరుద్ధంగా ఉన్నధ్ధని ఆయన అన్నారు.పెండింగ్‌లో ఉన్న పెన్షనరీ ప్రయోజనాలను విడుదల చేసి, వేతన సవరణ అమలు చేయాలి. కరువు భత్యం బకాయిలను చెల్లించాలనీ ఆయన డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో నడిగూడెం మండలం విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యదర్శి యల్ బాలాజీ, ఆర్థిక కార్యదర్శి యండి. ఇబ్రహీం, మండల కార్యవర్గ సభ్యులు అలుగువల్లి అప్పారెడ్డి, దున్న అంజయ్య, వేపూరి రాములు, తూము వెంకటేశ్వరరావు, పి విజయమ్మ, సీనియర్ పెన్షనర్లు యండి. జానిమియా, యం. వీరయ్య, జి రామయ్య, డి. వీరయ్య,జి సర్వమ్మ, డి పద్మ, డి మేరమ్మ, పి మంగమ్మ,జి జయమ్మ, జి ముత్యాలమ్మ, పాల్గొన్నారు.
