ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం వల్ల భవిష్యత్తులో వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశముందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు బ్లూ కాలర్ ఉద్యోగాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇబ్రహింపట్నంలో ఏర్పాటు చేసిన AVN లేక్‌ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు కోసం నాణ్యమైన విద్య అత్యవసరమని తెలిపారు. విద్యా రంగంలో నాణ్యత పడిపోవడం ఆందోళనకరమని, దీనిపై సమగ్ర సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.రాష్ట్రంలో వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 59 స్కూల్స్ పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి ఇంటర్ వరకు సమగ్ర విద్యా విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు తెలిపారు.ప్రైవేట్ స్కూళ్ల తరహాలో రవాణా, పోషకాహారం వంటి సౌకర్యాలను కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం స్పష్టం చేశారు. విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు.






