మే 15, (నేటి తెలుగు పత్రిక): సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తొగర్‌పల్లిలో రూ.650 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న భారీ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ భూమిపూజ నిర్వహించారు. 44 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ పరిశ్రమ ద్వారా స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, తెలంగాణ రైజింగ్ కార్యక్రమంతో రాష్ట్రాన్ని త్రీ ట్రిలియన్ ఎకానమీ దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జహీరాబాద్ వంటి ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి ద్వారా గ్రామీణ ప్రాంతాలకు ఉపాధి అవకాశాలు తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు.కేజేఎస్ యూనిట్–II పేరుతో ప్రారంభమవుతున్న ఈ పరిశ్రమ ద్వారా సుమారు 1500 మంది స్థానిక మహిళలకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. పరిశ్రమ పూర్తిగా కాలుష్య రహితంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రత్యేకంగా పనిచేస్తోందని, భవిష్యత్తులో ఈ ప్రాంతంలో అంతర్జాతీయ కారిడార్‌కు అనుసంధానంగా మరిన్ని పరిశ్రమలు తీసుకురానున్నట్లు వెల్లడించారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
