మే 17, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో అమలవుతున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యమైనా ఇండ్ల నిర్మాణ పనులు ఆగకుండా కొనసాగిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మీడియాతో మాట్లాడిన మంత్రి, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోందన్నారు. అయితే మరో కొద్ది రోజుల్లో నిధులు విడుదల కాకపోయినా లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే అవసరమైన మొత్తాన్ని భరిస్తుందని స్పష్టం చేశారు.ప్రస్తుతం రాష్ట్రంలో మొదటి విడత కింద లక్షలాది ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఇండ్లు పూర్తయ్యాయని, మరిన్ని ఇండ్లు త్వరలోనే నిర్మాణ దశ పూర్తి చేసుకుంటాయని వెల్లడించారు.రెండో విడత పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ విడతలో ఖాళీ స్థలాలున్న వారితో పాటు అసంపూర్తిగా ఉన్న ఇండ్లను కూడా పథకంలో చేర్చనున్నట్లు తెలిపారు. పేద కుటుంబాలకు మరింత ఉపయోగపడేలా నిబంధనల్లో సడలింపులు కల్పిస్తున్నామని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి ఎన్ని ఇండ్లు మంజూరు చేయాలనే అంశంపై త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.అదే సమయంలో రాష్ట్రంలో భూముల ప్రభుత్వ మార్కెట్ ధరలను సవరించే ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తెలిపారు. గతంలో జరిగిన అసమాన ధరల పెంపును సమీక్షించి, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త ధరలను నిర్ణయించనున్నట్లు చెప్పారు.
