మే 22, (నేటి తెలుగు పత్రిక): జూపల్లి కృష్ణారావు తెలంగాణ పర్యాటక రంగాన్ని డిజిటల్ వేదికల ద్వారా ప్రపంచానికి పరిచయం చేయాలని పిలుపునిచ్చారు. పర్యాటక రంగం కేవలం విహార యాత్రలకే పరిమితం కాకుండా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, యువత ఉపాధి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌కు బలమైన సాధనమని పేర్కొన్నారు.బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన “తెలంగాణ పర్యాటక క్రియేటర్ల సమావేశం”లో పాల్గొన్న మంత్రి, ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పర్యాటక రంగానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు.రాష్ట్రంలోని ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలు, సంస్కృతి సంపదను సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన టూరిజం ఇన్ఫ్లుయెన్సర్లు ఇచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు.పర్యాటక రంగం అభివృద్ధితో స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి అభిప్రాయపడ్డారు. పర్యాటక రంగం ద్వారా వచ్చే ఆదాయాన్ని విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగిస్తామని వెల్లడించారు.పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛత, కనీస సదుపాయాలు, ఆధునిక టెంట్ వసతుల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. వినియోగంలో లేని హరిత మోటళ్లు, టూరిజం భూములను ఆదాయ వనరులుగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.ఈ సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ కొత్త మెటా ఖాతా, అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను మంత్రి ఆవిష్కరించారు. తెలంగాణ వారసత్వం, చేనేత, హస్తకళలు, కలంకారీ కళా వైభవాన్ని ప్రతిబింబించే “టైమ్‌లెస్ తెలంగాణ” వీడియోను కూడా ప్రదర్శించారు.
