మే 22, (నేటి తెలుగు పత్రిక): విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ గురుకుల విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లు, ట్రాక్ సూట్లు, షూస్ అందజేయనున్నట్లు ఆమె వెల్లడించారు.తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన ముగ్గురు క్రీడాకారులను మంత్రి గురువారం అభినందించారు. గత నెల రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఇండియన్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ఈ క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు.గుంటూరుకు చెందిన టి. నాగజ్యోతి జూనియర్ విభాగం 76 కేజీల కేటగిరీలో 355 కేజీలు ఎత్తి జాతీయ రికార్డు సృష్టిస్తూ బంగారు పతకం సాధించింది. అలాగే కె. సత్యరామ్ రాజ్ 53 కేజీల విభాగంలో 110 కేజీలు ఎత్తి బంగారు పతకం గెలుచుకోగా, సబ్ జూనియర్ విభాగంలో వినోద్ కుమార్ కూడా 110 కేజీలు ఎత్తి జాతీయ రికార్డు నమోదు చేసి స్వర్ణ పతకం సాధించాడు.ఈ సందర్భంగా క్రీడాకారులతో పాటు వారికి శిక్షణ ఇచ్చిన కోచ్ ఎండీ కమ్రుద్దీన్‌ను మంత్రి సవిత ప్రత్యేకంగా అభినందించారు. క్రీడలు విద్యార్థుల్లో మానసిక ధైర్యం, శారీరక దృఢత్వం పెంపొందిస్తాయని, క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని తెలిపారు.సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న మంత్రి, గురుకుల విద్యార్థులకు మెరుగైన క్రీడా వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.ఈ కార్యక్రమంలో పలువురు క్రీడాకారులు, అధికారులు పాల్గొన్నారు.
