మే 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఎండలు తీవ్రరూపం దాల్చడంతో వడదెబ్బ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజులోనే 22 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిస్థితి మరింత విషమంగా మారింది.భూపాలపల్లి జిల్లాలో వడదెబ్బ కారణంగా నలుగురు మృతి చెందారు. రేగొండ మండలం భాగిర్తిపేటకు చెందిన యాకూబ్(45), మొగుళ్లపల్లి మండలం పోతుగల్లుకు చెందిన సక్కమ్మ(59), చిట్యాల మండలం చల్లగరిగేకు చెందిన పోషయ్య, కాటారం మండలం శంకరంపల్లికి చెందిన సమ్మక్క(65) ఎండ తీవ్రతను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే తొమ్మిది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్న సమయంలో బయటకు రావడానికి ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. చిన్నపిల్లలు, వృద్ధులు, కూలీలు వంటి వర్గాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని, వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్యశాఖ హెచ్చరించింది.
