మే 23, (నేటి తెలుగు పత్రిక): దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి యువతలోనే ఉందని, 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాల్సి ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు యువత జీవితాలను మార్చే దిశగా ముందుకు సాగుతున్నాయని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని బోయిగూడ రైల్ కళారంగ్‌లో నిర్వహించిన 19వ రోజ్‌గార్ మేళాలో పాల్గొన్న కిషన్ రెడ్డి కొత్తగా నియామకాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా 47 కేంద్రాల్లో ఒకేసారి నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా 51 వేల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. హైదరాబాద్ కేంద్రం నుంచి 220 మంది యువత ఉద్యోగాల్లో చేరుతున్నారని వెల్లడించారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 2022 దీపావళి రోజున ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన రోజ్‌గార్ మేళా ఇప్పటివరకు 12.5 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందన్నారు. ఇది కేవలం నియామకాల కార్యక్రమం మాత్రమే కాదని, యువత భవిష్యత్తును బలోపేతం చేసే జాతీయ మిషన్‌గా ప్రభుత్వం దీన్ని అమలు చేస్తోందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలోనూ విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. రహదారులు, రైల్వేలు, మెట్రోలు, ఎయిర్‌పోర్టులు, ఇండస్ట్రియల్ కారిడార్లు, డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా కోట్లాది ఉద్యోగాలు సృష్టిస్తున్నామని వివరించారు. ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా రూ.12 లక్షల కోట్లకు పైగా మౌలిక వసతుల పనులు జరుగుతున్నాయని, ప్రతి లక్ష కోట్ల పెట్టుబడితో లక్షలాది ఉద్యోగాలు పుడుతున్నాయని చెప్పారు.స్టార్టప్ రంగంలో భారత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని ఆయన అన్నారు. ఒకప్పుడు వందల్లో ఉన్న స్టార్టప్‌ల సంఖ్య ఇప్పుడు 1.2 లక్షలకు పైగా పెరిగిందని, యువత ఉద్యోగాలు అడిగే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు. యూనికార్న్ కంపెనీల పెరుగుదల భారత యువత సృజనాత్మకతకు నిదర్శనమని కొనియాడారు.
స్కిల్ డెవలప్‌మెంట్‌కు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంత యువతకు కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), డ్రోన్ టెక్నాలజీ వంటి అంశాలను మాతృభాషల్లో నేర్పిస్తున్నామని వెల్లడించారు.సెమీకండక్టర్లు, అంతరిక్ష పరిశోధనలు, డ్రోన్ టెక్నాలజీ, డిజిటల్ ఇన్నోవేషన్ రంగాల్లో భారత్ వేగంగా పురోగమిస్తోందని ఆయన అన్నారు. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందని గుర్తుచేశారు. స్వదేశీ సాంకేతికతతో దేశం ప్రపంచ వేదికపై సత్తా చాటుతోందన్నారు.భారత్ ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, త్వరలోనే మరింత ఉన్నత స్థానానికి చేరుకుంటుందని కిషన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. యువత నైపుణ్యాలు, ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం దేశాభివృద్ధికి బలమైన పునాది అవుతాయని పేర్కొన్నారు.మైనింగ్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, డ్రోన్, డేటా సైన్స్ వంటి రంగాల్లో భవిష్యత్తులో భారీ అవకాశాలు ఉన్నాయని ఆయన యువతకు సూచించారు. సంప్రదాయ ఉద్యోగాలకే పరిమితం కాకుండా కొత్త రంగాల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.యువతను ప్రధాని మోదీ “వికసిత భారతానికి సూపర్ హీరోలు”గా చూస్తున్నారని పేర్కొన్న కిషన్ రెడ్డి.. దేశ అభివృద్ధిలో ప్రతి యువకుడి పాత్ర అత్యంత కీలకమని అన్నారు. నైపుణ్యం, క్రమశిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యువతే భారత భవిష్యత్తును నిర్మిస్తారని ఆయన స్పష్టం చేశారు.
