మే 24, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌర సరఫరాలు, భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లపై హైదరాబాద్‌లో ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కాంటా కోసం ఎదురుచూస్తున్న 8.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సూచించారు. కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించాలని స్పష్టం చేశారు.తాలు, తరుగు పేరుతో రైతుల ధాన్యంపై కోతలు విధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. రైతులకు నష్టం కలిగించే చర్యలను ప్రభుత్వం సహించదన్నారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. తడిసిన ధాన్యాన్ని స్వీకరించకుండా నిర్లక్ష్యం చేసిన మిల్లర్లు, కొనుగోలు సిబ్బందిపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. రైతుల్లో గందరగోళం సృష్టించేలా వ్యవహరించవద్దని అధికారులకు సూచించారు.ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు ఇప్పటికే రూ.45 వేల కోట్ల చెల్లింపులు చేసినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈసారి మొత్తం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడమే లక్ష్యమన్నారు.కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రూ.8,749 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 21 కోట్ల గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉన్నాయని, కొరత ఉందన్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు. హమాలీల కొరత కారణంగా కొంత జాప్యం జరిగిందన్నారు.రబీ సీజన్‌లో రాష్ట్రంలో 141 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి నమోదైందని, కేంద్ర ప్రభుత్వం కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే కొనుగోలు చేస్తోందని మంత్రి వెల్లడించారు. మిగిలిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సేకరిస్తోందన్నారు.సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
