మే 25, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర సచివాలయం సహా ప్రభుత్వ కార్యాలయాల్లో సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, అమలులో మాత్రం పురోగతి కనిపించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు ఏడాది క్రితమే విద్యుత్ ఖర్చులు తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినా ఇప్పటివరకు పనులు ముందుకు సాగలేదని సమాచారం.ప్రస్తుతం సచివాలయానికి ప్రతి నెలా సుమారు రూ.70 లక్షల వరకు విద్యుత్ బిల్లు వస్తోందని తెలుస్తోంది. ఏడాదికి ఇది కోట్ల రూపాయలకు చేరుతోంది. సౌర విద్యుత్ వినియోగం పెంచితే ప్రభుత్వ ఖర్చులు గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.సచివాలయం పైకప్పుతో పాటు పరిసర ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని గతంలో ప్రతిపాదించారు. యూనిపోల్స్ విధానంలో సోలార్ విద్యుత్ దీపాలు కూడా ఏర్పాటు చేయాలని భావించినా ఆ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. సచివాలయ భవనం అందం దెబ్బతింటుందనే కారణంతో ప్రత్యామ్నాయంగా మరో ప్రాంతంలో సోలార్ గ్రిడ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి విద్యుత్ సరఫరా చేయాలనే ఆలోచన కూడా చర్చకు వచ్చింది. అయితే ఆ దిశగా కూడా ఎలాంటి నిర్ణయాత్మక చర్యలు కనిపించడం లేదు.ఇక సచివాలయంలో సోలార్ ప్యానెల్స్‌తో కూడిన పార్కింగ్ నిర్మాణ పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయని తెలుస్తోంది. పార్కింగ్ షెడ్లు లేకపోవడంతో వాహనాలు ఎండలోనే నిలిపివేయాల్సి వస్తోంది. డ్రైవర్లు, సిబ్బందికి విశ్రాంతి గదులు లేక కొంతమంది వాహనాల్లోనే ఏసీలు ఆన్ చేసి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.ప్రభుత్వ కార్యాలయాలను గ్రీన్ బిల్డింగ్స్‌గా మార్చే లక్ష్యం ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోవడంతో అధికారుల పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
