హైదరాబాద్, మే 25, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం ఎ. రేవంత్‌రెడ్డి మహిళా సంఘాల కోసం కార్పొరేట్ స్థాయి “ఇందిరా మహిళా శక్తి సూపర్ బజార్లు” ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.మొదటి విడతగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గ కేంద్రాల్లో మహిళా సంఘాలకు నామమాత్రపు అద్దెతో 30 ఏళ్ల లీజుపై స్థలాలు కేటాయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ సూపర్ బజార్లకు ప్రభుత్వం కార్పస్ ఫండ్ అందించనుండగా, మహిళలు కూడా భాగస్వామ్య పెట్టుబడి పెట్టాలని సీఎం కోరారు.అదే విధంగా ప్రతి మండలంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు, గోడౌన్లు, లాజిస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు అవసరమైన భూములు ప్రభుత్వం అందించడంతో పాటు బ్యాంకుల ద్వారా జీరో వడ్డీ రుణాలు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు. “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 8 వేల ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు సీఎం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



