మే 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం సామాజిక సమానత్వం, ఉపాధి అవకాశాల కల్పనలో మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ పరిసరాల్లో అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలు చేపడుతున్న హైడ్రా (HYDRAA) విభాగంలో 16 మంది ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఈ నిర్ణయం ద్వారా ట్రాన్స్‌జెండర్ సమాజానికి గౌరవప్రదమైన జీవనోపాధి మాత్రమే కాకుండా, ప్రభుత్వ సేవల్లో భాగస్వామ్యం అయ్యే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. కొత్తగా నియమితులైన వారిలో 11 మంది ట్రాన్స్ మహిళలు, 5 మంది ట్రాన్స్ పురుషులు ఉన్నారు. వీరందరినీ “ఈగిల్ టీమ్”లో నియమించారు. ఈ బృందం హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాల్లోని చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములపై జరుగుతున్న అక్రమ కబ్జాలను గుర్తించడం, తొలగింపు చర్యల్లో భాగస్వామ్యం కావడం వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది. హైడ్రా అధికారులతో కలిసి ఫీల్డ్ స్థాయిలో పనిచేస్తూ అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.సాధారణంగా ట్రాన్స్‌జెండర్ సమాజం ఉద్యోగ అవకాశాల కొరత, సామాజిక వివక్ష, అవమానాలను ఎదుర్కొంటూ జీవనం సాగించాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలాంటి సమయంలో ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశం తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపిందని ఉద్యోగులు భావోద్వేగంగా చెబుతున్నారు. హైడ్రా యూనిఫాం ధరించి విధులకు హాజరవడం తమకు ఎంతో గౌరవంగా అనిపిస్తోందని, ఇది కేవలం ఉద్యోగం కాదు.. తమ ఆత్మగౌరవానికి గుర్తు అని వారు పేర్కొంటున్నారు.ఈగిల్ టీమ్ ఏర్పాటు తర్వాత హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణలు, ప్రభుత్వ భూములపై అక్రమ నిర్మాణాలపై మరింత వేగంగా చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఎలాంటి రాజకీయ, ఆర్థిక ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తున్న ఈ బృందం పనితీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అక్రమ కబ్జాలపై ధైర్యంగా వ్యవహరిస్తున్న తీరుకు స్థానిక ప్రజల నుంచి కూడా మద్దతు లభిస్తున్నట్లు సమాచారం.ట్రాన్స్‌జెండర్లను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. అయితే ప్రత్యక్షంగా ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా వారిని స్వయం సమృద్ధి దిశగా నడిపించడం ఈ నిర్ణయంలోని ప్రత్యేకతగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈగిల్ టీమ్ సభ్యులు మాట్లాడుతూ, గతంలో జీవనోపాధి కోసం ఎన్నో కష్టాలు పడ్డామని, సమాజం తమను అంగీకరించని పరిస్థితులు ఎదురయ్యాయని చెప్పారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో తమ కుటుంబాలు, సమాజం తమను గౌరవంగా చూస్తున్నాయని తెలిపారు. తాము కూడా సమాజానికి సేవ చేయగలమనే నమ్మకం పెరిగిందని, భవిష్యత్తులో మరిన్ని ట్రాన్స్‌జెండర్లకు ఇలాంటి అవకాశాలు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.హైదరాబాద్ నగర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణలో ఈ బృందం కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు భావిస్తున్నారు. సమానత్వం, సామాజిక న్యాయం దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
