Breaking News

విశాఖ అభివృద్ధికి రూ.1,500 కోట్ల ప్రాజెక్టులు.. కేంద్ర నిధులతో కొత్త ఊపు: ఎంపీ శ్రీభరత్

మే 30, (నేటి తెలుగు పత్రిక): అంతర్జాతీయ నగరంగా వేగంగా ఎదుగుతున్న విశాఖపట్నం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పథకాలు కీలకంగా మారుతున్నాయని విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ తెలిపారు. కేంద్ర పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై నిర్వహించిన దిశా సమావేశంలో 33 శాఖలకు చెందిన అధికారులతో సమగ్ర సమీక్ష చేపట్టినట్లు వెల్లడించారు. నగర అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద విశాఖపట్నానికి రూ.1,500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు మంజూరైనట్లు ఎంపీ శ్రీభరత్ వెల్లడించారు. ముఖ్యంగా మధురవాడ ప్రాంతంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ, తాగునీటి సరఫరా విస్తరణ, నగర నీటి పంపిణీ వ్యవస్థ ఆధునీకరణ వంటి కీలక పనులు చేపడుతున్నామని తెలిపారు. నగర మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టులు రూపొందించబడుతున్నాయని చెప్పారు.విశాఖపట్నం దేశ, విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందుతున్న నేపథ్యంలో నగరాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఆయన అన్నారు. రవాణా, పారిశుద్ధ్యం, తాగునీరు, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై కూడా ఎంపీ శ్రీభరత్ విమర్శలు చేశారు. గత పాలనలో అనేక కీలక అభివృద్ధి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని, వాటి అమలు ఆలస్యం కావడంతో ప్రస్తుతం వ్యయభారం భారీగా పెరిగిందని ఆరోపించారు. నిలిచిపోయిన ప్రాజెక్టులను తిరిగి పట్టాలెక్కించి కేంద్ర పథకాల ద్వారా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.నగర డ్రైనేజీ వ్యవస్థను మరింత ఆధునికీకరించేందుకు మరోసారి అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద ప్రతిపాదనలు సమర్పిస్తున్నామని వెల్లడించారు. వర్షాకాలంలో నీటిమునిగే సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. అలాగే విశాఖ తీరప్రాంతాల్లో లభించే ఖనిజ సంపదను వినియోగంలోకి తీసుకువచ్చి ఆర్థికాభివృద్ధికి ఉపయోగించాలనే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.దిశా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ప్రతి అంశాన్ని లోతుగా సమీక్షించినట్లు తెలిపారు. విశాఖను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, ప్రతి మూడు నెలలకు ఒకసారి దిశా సమావేశాలు నిర్వహించడం వల్ల అభివృద్ధి పనుల అమలు వేగవంతమవుతోందని పేర్కొన్నారు.విశాఖపట్నం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల విస్తరణ, తాగునీటి సరఫరా మెరుగుదల, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, పట్టణ అభివృద్ధి ప్రాజెక్టుల అమలుతో నగరం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కూటమి సర్కారుపై జగన్ తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *