|| Incompetent CM Revanth who can’t even expand the cabinet || – కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి ప్రజల్లో మద్దతు లేకపోవడం వల్లే అధికార పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరుతున్నారని వ్యాఖ్యానించారు.
“15 నెలల్లోనే ప్రజలకు విసుగు”
- తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో స్టేషన్ ఘన్పూర్‌కు చెందిన మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ సీనియర్ నేత మల్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు.
- ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, “అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కూడా కాకముందే నేతలు పార్టీని వదిలిపెడుతుండటమే పాలన ఎలా ఉందో అర్థం చేసేందుకు నిదర్శనం” అని అన్నారు.
- “రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోనే కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్‌లో చేరుతున్నారు. ఇది ప్రజలు కాంగ్రెస్ పాలనపై ఎంత అసంతృప్తిగా ఉన్నారో చూపిస్తున్న ఉదాహరణ” అని వ్యాఖ్యానించారు.
“రైతు ఆత్మహత్యలు, ఎస్ఎల్బీసీ ప్రమాదం – సీఎం మాత్రం ప్రచారంలో”
- గత 48 గంటల్లో రాష్ట్రంలో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, మరోవైపు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయినా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారని మండిపడ్డారు.
- “ఈ ఎన్నికలతో ప్రభుత్వం మారదుగానీ, రేవంత్ మాత్రం హెలికాప్టర్ ఎక్కి ప్రచారం చేస్తున్నాడు” అని ఎద్దేవా చేశారు.
“మంత్రివర్గ విస్తరణ చేయలేని సీఎం”
- “రాష్ట్రానికి హోం మంత్రి, విద్యా మంత్రి, సంక్షేమ శాఖ మంత్రి లేరు” అని గుర్తుచేశారు.
- “మంత్రివర్గ విస్తరణ కూడా చేయలేని సీఎం, కేసీఆర్ను ఎలా మాయం చేస్తానంటాడు?” అని ప్రశ్నించారు.
- “రోజూ తెల్లారితే కేసీఆర్ పేరు, నిద్రలో కూడా ఆయన పేరే తలచుకుంటున్నట్టు ఉంది” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
“రేవంత్ గెలుపు లక్కీలాట.. ఇప్పుడు ఢిల్లీకి పరుగులు”
- “అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి తన సన్నిహితులతో ‘మనం గెలవలేం.. ప్రతిపక్షంలో ఉండి గట్టిగా పోరాడాలి.. కేసీఆర్ ఉన్నంతకాలం గెలుపు సాధ్యం కాదు’ అని అన్నట్లు సమాచారం” అని కేటీఆర్ వెల్లడించారు.
- “అయితే, ప్రజలు లక్కీ లాటలో గెలిపించారని, ఇప్పుడు ఆ గెలుపును నిలబెట్టుకోలేక ఢిల్లీకి 36 సార్లు పరుగులు తీస్తున్నాడు” అని విమర్శించారు.
- “ఎన్నిసార్లు వెళ్లినా, ఏం పీకినా రాష్ట్రానికి ఏ విధమైన ప్రయోజనం ఉండదని” కేటీఆర్ స్పష్టం చేశారు.