మే 16, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి ప్రయాణంలో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే వాటిని సవరించుకుంటూ లక్ష్య సాధన దిశగా నిబద్ధతతో పనిచేస్తామని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని తెలిపారు.“రానున్న పదేళ్లలో తెలంగాణ ఎలా ఉండబోతోంది” అనే థీమ్‌తో వే2న్యూస్ నిర్వహించిన కాంక్లేవ్‌లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు, రాజకీయాలు, ప్రభుత్వ లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికలపై అడిగిన ప్రశ్నలకు ఆయన సూటిగా సమాధానాలు ఇచ్చారు. ప్రభుత్వంలో సంక్షేమం నిరంతర ప్రక్రియ కాగా, అభివృద్ధి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.2047 నాటికి తెలంగాణను ప్రపంచ స్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ డాక్యుమెంట్ రూపొందించామని సీఎం వెల్లడించారు. ప్రపంచ స్థాయి మేధావులు, కార్పొరేట్ నిపుణులు, ప్రజల అభిప్రాయాలను సేకరించి ఎనిమిది నెలల పాటు కృషి చేసి ఈ ప్రణాళికను సిద్ధం చేశామని చెప్పారు. 108 దేశాల ప్రతినిధుల సమక్షంలో గ్లోబల్ సమ్మిట్‌లో ఈ విజన్‌ను ఆవిష్కరించినట్లు గుర్తుచేశారు.రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ ఉపకులాల వర్గీకరణ, బీసీ కులగణన, తుమ్మడిహెట్టి, పాలమూరు–రంగారెడ్డి వంటి ప్రాజెక్టుల పూర్తి దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. తెలంగాణ ఉద్యమ గీతమైన “జయ జయహే తెలంగాణ”ను రాష్ట్ర గీతంగా ప్రకటించడం, అమరవీరుల కుటుంబాలను గౌరవించడం వంటి అంశాలను కూడా ప్రస్తావించారు.
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో రాష్ట్ర జనాభాలో 40 శాతం మంది నివసిస్తున్నారని, ఈ ప్రాంత సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. కాలుష్య పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించేందుకు హిల్ట్ పాలసీ తీసుకొచ్చామని చెప్పారు. మూసీ నది పునరుజ్జీవం, నాలాల ఆక్రమణల తొలగింపు, చెరువులు–ప్రభుత్వ భూముల రక్షణ కోసం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై మాట్లాడుతూ, మెట్రో, జాతీయ రహదారులు, పోర్టులు, ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీతో భారీ మౌలిక సదుపాయాలు కల్పిస్తే లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు. పరిమిత ప్రణాళికల కంటే దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలే రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయని అన్నారు.మహిళల కోసం ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం వల్ల గ్రామీణ కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గిందని చెప్పారు. ఒక్కో మహిళ సంవత్సరానికి సుమారు రూ.10 వేల వరకు ఆదా చేసుకుంటోందని, ఆ డబ్బుతో పిల్లల విద్యకు ఉపయోగపడుతోందన్నారు. 2024-25లో ప్రభుత్వ పాఠశాలల్లో జీరో డ్రాప్‌అవుట్స్ నమోదయ్యాయని నీతి ఆయోగ్ వెల్లడించిన విషయాన్ని ప్రస్తావించారు.“ప్రజలందరినీ పూర్తిగా మెప్పించడం సాధ్యం కాదు. కానీ 60 నుంచి 75 శాతం మంది ప్రజలు ప్రభుత్వ నిర్ణయాలను ఆమోదిస్తే అదే గొప్ప విజయంగా భావిస్తాను. లక్ష్యంపై స్పష్టత ఉంటే ఒత్తిడులను అధిగమించి ముందుకు వెళ్లగలం” అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
