హైదరాబాద్, మే 16, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రక్షణ సేన కార్యక్రమంలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత పలు రాజకీయ అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎం కాదని, “ఆర్ఎస్ఎస్ సీఎం” అని విమర్శించారు. బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడిపై వచ్చిన ఆరోపణల వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మహిళలు గమనిస్తున్నారని అన్నారు. విచారణ పూర్తయ్యే వరకు బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని ప్రకటించారు.బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కూడా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. “ఉద్యమ కేసీఆర్‌తో నాకు ఎలాంటి సమస్య లేదు.. కానీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్‌తోనే సమస్య వచ్చింది” అని తెలిపారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినందుకే తనను ఒంటరిని చేశారని ఆరోపించారు. అంతర్గతంగా చెప్పిన అభిప్రాయాలు బయటకు వచ్చేలా చేసి, చివరకు తాను బయటకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని పేర్కొన్నారు.ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు సమయంలో తన తల్లి కుటుంబం నుంచి సరైన మద్దతు రాలేదని, అయితే అత్తవారి కుటుంబం అండగా నిలిచిందని చెప్పారు. “చేదు అనుభవాలు, కఠిన పరిస్థితులు చూసాకే నాలో మార్పు వచ్చింది” అని వ్యాఖ్యానించారు.తెలంగాణలో గుణాత్మక మార్పు తీసుకురావడానికే తెలంగాణ రక్షణ సేనను ఏర్పాటు చేశామని కవిత వెల్లడించారు. రైతులు, మహిళలు, యువత, వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చే రాజకీయాలు చేయాలనుకుంటున్నామని తెలిపారు. యువతను ఉద్యోగాలు అడిగే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు. 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు రుణాలు ఇచ్చి యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని చెప్పారు.నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని కవిత ఆరోపించారు. గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోయామని, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ఆలస్యమైందని విమర్శించారు. “తెలంగాణ వచ్చి 12 ఏళ్లు అయినా పాలమూరులో వలసలు ఆగలేదు” అని అన్నారు.రాజకీయాల్లో మహిళలకు అవకాశాలు పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్న కవిత.. “ఆడపిల్లలు రాజకీయాల్లో విఫలమైతే వారికి ఏమీ చేతకాదనే ముద్ర వేస్తారు. అందుకే నేను తప్పకుండా విజయవంతం కావాలి” అని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని, అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
