మే 17, (నేటి తెలుగు పత్రిక): ఓటరు జాబితాల ప్రత్యేక సమీక్ష (SIR) అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఒక్కో వ్యక్తికి ఒక్క ఓటు మాత్రమే ఉండాలని, ఓటరు జాబితాల పరిశుభ్రత కోసం ఈ ప్రక్రియ అవసరమని స్పష్టం చేశారు.హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడిన కిషన్‌రెడ్డి.. తెలంగాణలో సర్ షెడ్యూల్ ఇప్పటికే ప్రారంభమైందని తెలిపారు. ప్రింటింగ్ లోపాల వల్ల కొందరి పేర్లు పలు ప్రాంతాల్లో కనిపిస్తున్నాయని, వాటిని సరిచేయడానికే ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు చెప్పారు.రాహుల్ గాంధీని వ్యక్తిగతంగా తప్పుపట్టడం లేదని పేర్కొన్న ఆయన.. ఓటరు జాబితాలను సరిచేయడం ప్రతి రాజకీయ పార్టీ బాధ్యత అని అన్నారు. బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఇంటికి పలుమార్లు వెళ్లి వివరాలు సేకరిస్తారని తెలిపారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిపై కూడా కిషన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపైనే నమ్మకం లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. సర్ ప్రక్రియను నిర్వహించేది ప్రభుత్వ ఉద్యోగులేనని, బీజేపీ కార్యకర్తలు కాదని స్పష్టం చేశారు.సర్‌లో కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించడం బాధ్యతారాహిత్యమని అన్నారు. ఎక్కడ కుట్ర జరిగిందో స్పష్టంగా చెప్పాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. కేరళ, తమిళనాడులో బీజేపీ గెలవకపోతే సర్ బాగుందని.. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ బలపడితే సర్ తప్పు అంటున్నారని ఎద్దేవా చేశారు.పోలింగ్ కేంద్రాలకు వెళ్లి అభ్యంతరాలు తెలియజేయాలని, ఎన్నికల కమిషన్‌పై బురద జల్లొద్దని రాజకీయ పార్టీలకు సూచించారు. విదేశీయులు, అక్రమ వలసదారులు ఓటరు జాబితాల్లో ఉంటే వారిని తొలగించాల్సిందేనని అన్నారు.రైతు సమస్యలపైనా కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదని, అనేక మంది రైతులు బ్యాంకుల వద్ద డిఫాల్టర్లుగా మారారని పేర్కొన్నారు.ధాన్యం కొనుగోలులో కేంద్రం పూర్తి సహకారం అందిస్తున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇబ్బందులు పడుతోందో చెప్పాలని ప్రశ్నించారు. సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన హామీని ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు.రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలను ఇతరులపై నెట్టే ప్రయత్నం చేస్తోందని కిషన్‌రెడ్డి విమర్శించారు.
