మే 28, (నేటి తెలుగు పత్రిక): తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన నందమూరి తారక రామారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళగిరిలో జరుగుతున్న మహానాడు వేడుకల్లో ఆయన ఈ ప్రతిపాదన చేశారు.ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు, లోకేశ్, పార్టీ నేతలు కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ క్లస్టర్ల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు మహానాడుకు హాజరయ్యాయి.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అంటే పేదలకు భరోసా, రైతులకు అండ అని పేర్కొన్నారు. సాధారణ ఉద్యోగిగా ప్రారంభమైన ఆయన జీవితం సినీ రంగంలో అగ్రస్థానానికి చేరి, అనంతరం ప్రజల కోసం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా ఎదిగిందని గుర్తుచేశారు. “సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు” అనే సిద్ధాంతంతో ఎన్టీఆర్ ప్రజాసేవ చేశారని చంద్రబాబు అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేతగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు.మహిళలకు ఆస్తి హక్కు కల్పించడం, యువతకు రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వడం, రైతులు, కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడం వంటి అనేక సంస్కరణలను ఎన్టీఆర్ తీసుకొచ్చారని తెలిపారు.దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యం తీసుకువచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగు దేశం పార్టీ కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు.తెలుగు ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలని మహానాడు ఏకగ్రీవంగా తీర్మానించిందని చంద్రబాబు వెల్లడించారు.
