Breaking News

‘సమగ్ర సంక్షేమ కార్డు’ రూపకల్పనకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

మే 28, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ప్రతి పౌరుడికి అందుతున్న అన్ని సంక్షేమ పథకాల వివరాలు ఒకే కార్డులో అందుబాటులో ఉండేలా ‘సమగ్ర సంక్షేమ కార్డు (యూనిఫైడ్ కార్డ్)’ రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.ఈ కార్డు ద్వారా ఏ పౌరుడికి ఏ శాఖ నుంచి, ఏ పథకం కింద, ఎంత మేర లబ్ధి అందుతోందో స్పష్టంగా తెలుసుకునే విధంగా వ్యవస్థ ఉండాలని సీఎం సూచించారు. ఇందుకోసం అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు.మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, సీఎం స్పెషల్ సెక్రటరీ బి. అజిత్ రెడ్డి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి తదితరులతో జరిగిన సమీక్షలో ఈ అంశంపై విస్తృతంగా చర్చించారు.సమగ్ర సంక్షేమ కార్డు ద్వారా ప్రతి పౌరుడి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకేచోట అందుబాటులోకి వస్తుందని సీఎం పేర్కొన్నారు. ఈ డేటాను ఏఐ సాయంతో విశ్లేషిస్తే పథకాల అమలులో పారదర్శకత పెరగడంతో పాటు నిజమైన అర్హులకు సంక్షేమ ఫలాలు చేరే అవకాశం ఉంటుందని చెప్పారు.ఈ కార్డులో ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్, ఫీజు రీయింబర్స్‌మెంట్, కార్మిక శాఖ, విద్యాశాఖ, బీమా పథకాల వంటి అన్ని సంక్షేమ సేవల వివరాలు ఉండాలని సూచించారు. అవసరమైతే ఆధార్ తరహాలో రాష్ట్ర స్థాయి ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నంబర్ ఇవ్వడంపై కూడా ఆలోచించాలని పేర్కొన్నారు.ఇటీవల నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలను కూడా ఈ కార్డుతో అనుసంధానం చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పూర్తి వివరాలను కూడా సేకరించాలని ఐటీ శాఖకు సూచించారు.మరణ ధృవీకరణ పత్రం జారీ అయితే ఆ సమాచారం వెంటనే పెన్షన్ డేటాబేస్‌కు చేరేలా, ప్రజల ఆరోగ్య ప్రొఫైల్ కూడా కార్డుతో అనుసంధానం చేసేలా ఏఐ ఆధారిత వ్యవస్థను రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు.కేరళ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికుల కోసం అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేసి, పాస్‌పోర్ట్, వీసా, నైపుణ్యాభివృద్ధి వంటి సేవలను ఒకే వేదికపై అందుబాటులోకి తేవాలని సూచించారు. దీంతో అనధికార ఏజెంట్ల ప్రభావం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.

కాజీపేటలో త్వరలో ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ: అశ్వినీ వైష్ణవ్

పొంగులేటిపై కేటీఆర్ సవాల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *