మే 29, (నేటి తెలుగు పత్రిక): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బోడ జనార్థన్ తన అనుచరులతో కలిసి గులాబీ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు.ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సబ్బండ తెలంగాణ వర్గాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఆ ప్రణాళిక రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందని చెప్పారు. ప్రజల సమస్యలను ప్రశ్నించి, పోరాడి, పరిష్కారం సాధించే దిశగా తమ పార్టీ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.సింగరేణి, ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోందని కవిత ఆరోపించారు. కనీస వేతనాల పేరుతో కార్మికులను మోసం చేస్తున్నారని విమర్శించారు. సింగరేణిలో అవినీతి పెరిగిపోయిందని, కార్మికుల హక్కులు కాలరాయబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి అమలు చేయలేదని, కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కార్మికుల హక్కుల కోసం మరింత బలంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.మాజీ మంత్రి బోడ జనార్థన్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కవిత చేస్తున్న పోరాటం తనను ఆకట్టుకుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం గులాబీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు.
