Breaking News

కర్ణాటక కోటాలో షర్మిలకు రాజ్యసభ అవకాశం?

మే 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిలకు రాజ్యసభ సభ్యత్వం దక్కే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. కర్ణాటక నుంచి ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకదానికి ఆమె పేరును కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం.ఇటీవల షర్మిల తన భర్త అనిల్ కుమార్‌తో కలిసి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ వ్యూహాలు, దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు, రాజ్యసభ ఎన్నికల అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.రెండేళ్ల క్రితం వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన సమయంలో షర్మిలకు తగిన రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తామని పార్టీ అధిష్ఠానం హామీ ఇచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ హామీ అమలులో భాగంగానే రాజ్యసభ అవకాశం కల్పించే దిశగా కాంగ్రెస్ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణ బాధ్యతలను చేపట్టిన షర్మిల, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు రాజ్యసభ సభ్యత్వం లభిస్తే జాతీయ స్థాయిలో పార్టీ తరఫున మరింత చురుకైన పాత్ర పోషించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే షర్మిల అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కర్ణాటక రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ ఖరారయ్యే సమయంలో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ వర్గాల్లో షర్మిల పేరు ప్రధానంగా వినిపిస్తుండటం రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది.

విద్యతోనే పేదరికంపై విజయం సాధించవచ్చు: మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

ఆంధ్రప్రదేశ్‌ను జౌళి రంగంలో అగ్రస్థానంలో నిలబెడతాం: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *