మే 30, (నేటి తెలుగు పత్రిక): పేదరికాన్ని జయించి జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి విద్యే అత్యంత శక్తివంతమైన ఆయుధమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించి వారిని సమాజంలో ఉన్నత స్థానాలకు చేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు మరియు సిబ్బందికి నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2025-26 విద్యాసంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు.మంత్రి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి వారిని పోటీ ప్రపంచంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. అభివృద్ధికి కులం అడ్డంకి కాదని, చదువు ఉంటే ఏ స్థాయికైనా చేరుకోవచ్చని విద్యార్థులకు సూచించారు.హాస్టళ్లలో పారిశుద్ధ్యం, నాణ్యమైన భోజనం, వసతి సదుపాయాల మెరుగుదలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ప్రతి వారం హాస్టళ్ల పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణల ఫలితంగా గురుకులాలు, హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు ఈ ఏడాది అత్యుత్తమ ఫలితాలు సాధించారని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు, బాలికలకు సురక్షిత వాతావరణంలో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో మొదటి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలతో పాటు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. జిల్లా స్థాయి ప్రతిభావంతులైన విద్యార్థులను కూడా సత్కరించారు. అలాగే ఉత్తమ ఫలితాల సాధనలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, అధికారులను ఘనంగా సన్మానించారు.విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేస్తోందని మంత్రి వెల్లడించారు. హాస్టళ్ల మరమ్మతులు, అదనపు మరుగుదొడ్లు, కొత్త భవనాల నిర్మాణం వంటి పనులకు వందల కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు.
