Breaking News

పట్టణ పేదలకు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి

మే 30, (నేటి తెలుగు పత్రిక): పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద కుటుంబాలకు సౌకర్యవంతమైన, భద్రమైన మరియు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్‌కు అనుగుణంగా పట్టణ పేదలకు గౌరవప్రదమైన జీవనం అందించే లక్ష్యంతో అర్బన్ ఇందిరమ్మ ఇళ్ల రూపకల్పన జరుగుతోందన్నారు.పట్టణ అభివృద్ధి పరిధిలోని 24 నియోజకవర్గాల్లో తొలి దశలో లక్ష ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన నేపథ్యంలో మంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పలు నమూనా డిజైన్లను పరిశీలించి కీలక సూచనలు చేశారు.రాబోయే నాలుగు నుంచి ఐదు దశాబ్దాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇళ్ల నిర్మాణం చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. కేవలం గృహ నిర్మాణానికే పరిమితం కాకుండా డ్రైనేజీ, పార్కింగ్, వాణిజ్య అవసరాలు, సామాజిక మౌలిక సదుపాయాలను కూడా ప్రణాళికల్లో భాగం చేయాలని సూచించారు. అవసరమైతే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పది అంతస్తుల వరకు భవనాలు నిర్మించే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.ఇళ్లలో హాల్, పడకగది, వంటగది, స్నానగది వంటి విభాగాల రూపకల్పనలో ప్రజల సౌకర్యాలతో పాటు వాస్తు అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. పేద కుటుంబాలు ఆత్మగౌరవంతో జీవించేలా ప్రతి ఇంటి నమూనా ఉండాలని తెలిపారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గాన్ని ప్రత్యేక యూనిట్‌గా పరిగణించి, అక్కడి ప్రజలకు అదే ప్రాంతంలో ఇళ్లను కేటాయించే విధానాన్ని అమలు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలు తమ ఉపాధి, జీవనాధారాలకు దూరం కాకుండా నివాస సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ముఖ్యమంత్రితో తుది చర్చల అనంతరం ఇళ్ల డిజైన్లను ఖరారు చేసి, యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచే గృహ నిర్మాణ నమూనాను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయబోతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు.

ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ నంబర్-1.. రైతుల కృషికే ఘనత: మంత్రి తుమ్మల

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *