Breaking News

ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ నంబర్-1.. రైతుల కృషికే ఘనత: మంత్రి తుమ్మల

మే 30, (నేటి తెలుగు పత్రిక): వ్యవసాయ రంగంలో తెలంగాణ మరో కీలక మైలురాయిని అధిగమించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్–ఆయిల్ పామ్ కార్యక్రమంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ ఘనత వెనుక రాష్ట్ర రైతుల కష్టపాటు, ప్రభుత్వ ప్రోత్సాహం ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.న్యూఢిల్లీలో నిర్వహించిన జాతీయ వ్యవసాయ సదస్సులో రాష్ట్రాల వారీగా ఆయిల్ పామ్ సాగు పురోగతిని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించగా, తెలంగాణ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. 2021 నుంచి 2026 వరకు దేశవ్యాప్తంగా సాగు చేసిన ఆయిల్ పామ్ విస్తీర్ణంలో తెలంగాణ ఒక్కటే 36 శాతం వాటాతో ముందంజలో నిలవడం విశేషమని మంత్రి తెలిపారు.ప్రస్తుతం రాష్ట్రంలో లక్షకు పైగా హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు జరుగుతుండగా, దాదాపు 80 వేల మంది రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారని వెల్లడించారు. సంప్రదాయ పంటలతో పాటు లాభదాయకమైన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాల వైపు రైతులు అడుగులు వేయడం వల్లే ఈ విజయాన్ని సాధించగలిగామని అన్నారు.దేశంలో వంటనూనెల అవసరం పెరుగుతున్న నేపథ్యంలో దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి స్వయం సమృద్ధి సాధించేందుకు ఆయిల్ పామ్ సాగు కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి వివరించారు. ఇతర నూనెగింజల పంటలతో పోలిస్తే అధిక దిగుబడి, దీర్ఘకాలిక ఆదాయం అందించే పంటగా ఆయిల్ పామ్ రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు.ఒకసారి తోటను ఏర్పాటు చేస్తే దాదాపు మూడు దశాబ్దాల పాటు దిగుబడి లభిస్తుందని, రైతులు ఎకరాకు సంవత్సరానికి లక్షల రూపాయల ఆదాయం పొందే అవకాశం ఉందని తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ పంట కీలకంగా మారిందన్నారు.తెలంగాణ రైతుల శ్రమ, పట్టుదల, ప్రభుత్వ మద్దతు కలిసివచ్చిన ఫలితంగానే ఈ జాతీయ గుర్తింపు లభించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఆయిల్ పామ్ సాగు విస్తరణకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించి రైతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.

పట్టణ పేదలకు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *