మే 30, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ మహానాడులో నాయకుల ప్రసంగాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మహానాడులో మాట్లాడిన ప్రతి నాయకుడు పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ విజయాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజలకు చేరవేసేలా ప్రసంగించారని ఆయన అభినందించారు.శుక్రవారం సచివాలయంలో పలువురు మంత్రులతో సమావేశమైన ముఖ్యమంత్రి తాజా రాజకీయ పరిణామాలు, మహానాడు విజయవంతమైన నిర్వహణ, మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు, ప్రతిపక్షాల విమర్శలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కూడా కీలక సూచనలు చేసినట్లు సమాచారం.మహానాడులో మొత్తం 88 మంది నాయకులు ప్రసంగించగా, ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన సమయంలోనే స్పష్టంగా, ప్రభావవంతంగా పార్టీ సందేశాన్ని ప్రజలకు చేరవేశారని సీఎం ప్రశంసించారు. ఇదే ఉత్సాహం, ఇదే దూకుడుతో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లాలని సూచించారుప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని వాస్తవాలతో తిప్పికొట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు సంబంధించిన అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించినట్లు తెలుస్తోంది.మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని పార్టీ చారిత్రాత్మక నిర్ణయంగా భావిస్తోందని, మహిళా నాయకత్వాన్ని మరింత ప్రోత్సహించే దిశగా చర్యలు కొనసాగించాలని సమావేశంలో చర్చించినట్లు సమాచారం.ప్రజలకు చేరువయ్యే రాజకీయాలే పార్టీ బలాన్ని పెంచుతాయని, ప్రతి నాయకుడు ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను నిర్వర్తించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. మహానాడు వేదికగా వచ్చిన స్పందనను భవిష్యత్ రాజకీయ బలంగా మలుచుకోవాలని ఆయన సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
