మే 30, (నేటి తెలుగు పత్రిక): మొయినాబాద్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన ఏర్పాటైందని తెలిపారు. మొయినాబాద్, చేవెళ్ల ప్రాంతాల్లో 111 జీవో కారణంగా రైతులు, భూయజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కవిత పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 111 జీవోను రద్దు చేసి రైతులకు, స్థానిక ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత భూములకు అధిక విలువ ఉన్నప్పటికీ, జీవో కారణంగా ప్రజలు పూర్తిస్థాయిలో ప్రయోజనం పొందలేకపోతున్నారని అన్నారు.తెలంగాణ ఏర్పాటుతో ప్రజల ఆశలు నెరవేరతాయని భావించినా అనేక సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయని ఆమె విమర్శించారు. తెలంగాణ హక్కులు, ప్రజల ప్రయోజనాల కోసం తమ పార్టీ నిరంతరం పోరాడుతుందని చెప్పారు.రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర ప్రభావానికి గురైందని, ప్రభుత్వ విధానాల వల్ల వ్యాపారులు, రైతులు నష్టపోయారని ఆరోపించారు. ప్రజలు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించే స్థాయికి రావాలని, ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.మైనార్టీలు, మహిళలు, యువతకు ప్రాధాన్యం కల్పించే రాజకీయ వేదికగా తెలంగాణ రక్షణ సేన ఎదుగుతోందని కవిత తెలిపారు. మహిళల సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు, స్వయం ఉపాధి కోసం ఎలాంటి హామీలు లేకుండా రుణాలు అందించే విధానాన్ని అమలు చేస్తామని ఆమె వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధిలో అన్ని వర్గాల భాగస్వామ్యంతో ముందుకు సాగుతామని కవిత స్పష్టం చేశారు.






