Breaking News

జూన్ 7న ‘ఫిట్ ఇండియా–సండేస్ ఆన్ సైకిల్’.. ఆరోగ్య తెలంగాణకు సైక్లింగ్ మహోత్సవం

మే 31, (నేటి తెలుగు పత్రిక): ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహిస్తూ ప్రజల్లో ఫిట్‌నెస్‌పై మరింత అవగాహన కల్పించేందుకు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్‌స్) ఆధ్వర్యంలో జూన్ 7న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో భారీ స్థాయిలో ‘ఫిట్ ఇండియా–సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా చేపడుతున్న ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా యువత, విద్యార్థులు, ఉద్యోగులు, క్రీడాకారులు మరియు సాధారణ ప్రజలను ఆరోగ్యకరమైన జీవన విధానం వైపు ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇటీవల శాట్‌స్ వైస్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎ. సోనిబాలా దేవి గవర్నర్‌ను కలిసి అధికారికంగా ఆహ్వానించగా, ఆయన కార్యక్రమంలో పాల్గొనేందుకు అంగీకరించి విజయవంతం కావాలని ఆకాంక్షించారు.‘ఫిట్‌నెస్ కి డోస్ – ఆధా గంటా రోజ్’ అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ సైక్లింగ్ ర్యాలీ గచ్చిబౌలి స్టేడియం ప్రధాన ద్వారం నుంచి ప్రారంభమై నగరంలోని పలు ప్రధాన ప్రాంతాల మీదుగా కొనసాగనుంది. ఐఐఐటీ జంక్షన్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, పిస్తా హౌస్ జంక్షన్, బిట్స్ పరిసరాలు, కేబుల్ బ్రిడ్జ్, మాదాపూర్, భారతీయ విద్యాభవన్ సెంటర్ రోడ్, బయోడైవర్సిటీ రోడ్ మీదుగా ప్రయాణించి తిరిగి గచ్చిబౌలి స్టేడియానికి చేరుకుంటుంది.ఈ ర్యాలీలో సుమారు 2,000 మంది సైక్లిస్టులు పాల్గొనే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. సైక్లింగ్ క్లబ్‌లు, క్రీడా సంఘాలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ శాట్‌స్ తరఫున ప్రత్యేక పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు.సైక్లింగ్ అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, అది పర్యావరణ హిత రవాణా విధానమని డాక్టర్ సోనిబాలా దేవి పేర్కొన్నారు. సైక్లింగ్ ద్వారా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గడమే కాకుండా, శారీరక దృఢత్వం పెరుగుతుందని తెలిపారు. నగరాల్లో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడంలో, ఇంధన వినియోగాన్ని నియంత్రించడంలో కూడా సైక్లింగ్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.అంతేకాకుండా ఇలాంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో ఆరోగ్య చైతన్యం పెరగడంతో పాటు యువతలో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, సామాజిక అనుబంధాలు కూడా బలోపేతం అవుతాయని ఆమె అభిప్రాయపడ్డారు. తెలంగాణను ఫిట్‌నెస్ రంగంలో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం మరియు శాట్‌స్ సంయుక్తంగా మరిన్ని కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు ముందస్తుగా నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాలు, నమోదు ప్రక్రియ కోసం గచ్చిబౌలి స్టేడియం అడ్మినిస్ట్రేటర్ కె. మధును సంప్రదించవచ్చని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఫిట్‌నెస్ ఉద్యమాన్ని మరింత విస్తరించే దిశగా ఈ కార్యక్రమం ఒక కీలక అడుగుగా నిలవనుందని క్రీడా వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

తుమ్మిడిహెట్టి అంశంపై మహారాష్ట్ర సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు: సీఎం రేవంత్

ఉచిత విద్యుత్‌పై బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ సవాల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *