Breaking News

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు కార్యాచరణ.. అర్హులందరికీ గౌరవం కల్పిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

మే 31, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల సేవలను గుర్తించి వారికి సముచిత గౌరవం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న ప్రతి ఒక్కరి వివరాలను సేకరించి పారదర్శక విధానంలో అర్హుల జాబితాను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు.తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగింది. కమిటీ చైర్మన్ డాక్టర్ కె. కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉద్యమకారుల వివరాల సేకరణ, గుర్తింపు ప్రమాణాలు, కార్యాచరణ రూపకల్పన వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం కోసం తమ జీవితాలను అంకితం చేసిన వారందరినీ ప్రభుత్వం గుర్తించాలని సంకల్పించిందన్నారు. అమరవీరుల కుటుంబాలతో పాటు ఉద్యమం తొలి, మలి దశల్లో కీలక పాత్ర పోషించిన కార్యకర్తలు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, మేధావులు, రచయితలు, కళాకారులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, ఆర్టీసీ ఉద్యోగులు, సింగరేణి కార్మికులు తదితర వర్గాలందరినీ గుర్తించి గౌరవించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉద్యమ సమయంలో జైలు శిక్షలు అనుభవించిన వారు, పోలీసు కేసులు ఎదుర్కొన్న వారు, క్షేత్రస్థాయిలో ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్న వారి వివరాలను సమగ్రంగా సేకరించాలని అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రతి ఒక్కరి పాత్రను గుర్తించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.కమిటీ చైర్మన్ డాక్టర్ కె. కేశవరావు మాట్లాడుతూ, తెలంగాణ కోసం జరిగిన దీర్ఘకాల పోరాటంలో పాల్గొన్న వారందరికీ తగిన గుర్తింపు ఇవ్వడమే కమిటీ ప్రధాన లక్ష్యమన్నారు. అర్హుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటిస్తూ ఎలాంటి వివాదాలకు తావులేకుండా ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.ఉద్యమకారుల గుర్తింపుపై రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల అభిప్రాయాలను కూడా స్వీకరించాలని కమిటీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జూన్ 4న అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి సూచనలు, సలహాలు తీసుకోనున్నారు. ఉద్యమ చరిత్రకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించి ప్రభుత్వం ముందు నివేదిక సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుల సేవలను గౌరవించే దిశగా ప్రత్యేక చొరవ తీసుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర సాధన కోసం త్యాగాలు చేసిన ప్రతి ఉద్యమకారుడికి చరిత్రలో సముచిత స్థానం కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని గుర్తించి గౌరవించే ప్రక్రియ త్వరలో వేగవంతం కానుందని వెల్లడించారు

తుమ్మిడిహెట్టి అంశంపై మహారాష్ట్ర సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు: సీఎం రేవంత్

ఉచిత విద్యుత్‌పై బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ సవాల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *