Breaking News

సంపూర్ణ సాధికార‌తే నిజ‌మైన మ‌హిళాభ్యుద‌యం

కోదాడ, మార్చి 7(నేటి తెలుగు పత్రిక): గ‌డిచిన రెండున్న‌ర శ‌తాబ్దాల్లో మ‌హిళ‌ల సామాజిక స్థాయి పెరిగింద‌న‌డంలో సందేహాలు లేవు. కానీ, సాధించిన‌దానితో సంతృప్తి చెంద‌డం ఆధునిక భావ‌న‌కు విరుద్ధం. స్వేచ్ఛ‌, స‌మాన‌వ‌త్వ, సౌబ్రాతృత్వం అంద‌రి జీవితాల్లోనూ వెలుగులు నింపాలి. ఇప్ప‌టికీ ఈ ఆధునిక భావాలకు ఆటంకాలున్నాయి. అన్ని రంగాల్లో మ‌హిళ‌లు ఉన్నంత మాత్రాన లింగ వివ‌క్ష తొల‌గిన‌ట్టు కాదు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్లు విద్య‌, ఉద్యోగ రంగాల్లో మ‌హిళ‌ల భాగ‌స్వామ్యాన్ని పెంచింది నిజ‌మే. కానీ ఆ విద్య‌, ఉద్యోగ రంగాల్లో కూడా మ‌హిళ‌లు వివ‌క్ష‌ను, అణ‌చివేత‌ను ఎదుర్కొంటున్నారు. ఈ స‌మ‌స్య‌కూ ప‌రిష్కారం చూపాల్సిన అవ‌స‌రం ఉంది. కుటుంబ‌, సామాజిక జీవితంలో ఎదుర్కొనే అణ‌చివేత‌, వివ‌క్ష నుంచి మ‌హిళ‌ల‌కు విముక్తి కావాలి. విద్య‌, ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు స్త్రీల‌కు ఆ విముక్తిని క‌ల్పిస్తాయ‌ని ఆశించారు. కానీ, కుటుంబంలోని వివ‌క్ష‌, అణ‌చివేత‌తోపాటు బ‌య‌టి స‌మాజంలోని వివ‌క్ష‌ను అధ‌నంగా బ‌రించాల్సి వ‌స్తున్న‌ది. కేవ‌లం చ‌ట్టాల ద్వారా స్త్రీల‌కు అవ‌కాశాలు క‌ల్పించ‌డం ద్వారానే మ‌హిళా సాధికార‌త సాధ్యం కాద‌నేది ఇంకా కొన‌సాగుతున్న అస‌మాన‌త‌లు రుజువు చేస్తున్నాయి. స‌మాజంలో స్త్రీల‌ను క‌ట్టుబాట్ల‌లో ఉంచ‌డం బ‌లంగా నాటుకుపోయిన మ‌న కుటుంబాల్లో పితృస్వామ్యం బ‌లంగానే ఉంది. కుటుంబం విలువ‌ల పేరుతో పితృస్వామ్యం ఆడ‌వాళ్ల‌ను క‌ట్ట‌డి చేస్తోంది. సాంస్కృతిక విలువ‌లు, మ‌త నియ‌మాలు మ‌గ‌వాళ్ల ఆధిప‌త్యానికి కొమ్ము కాస్తున్నాయి. ఇవి మ‌హిళ‌ల స్వావ‌లంబ‌నకు ఆటంకం. కాబ‌ట్టి ప్ర‌భుత్వాలు పూనుకుని సామాజిక సంస్క‌ర‌ణ కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టాలి. కొన్ని మొక్క‌బ‌డి కార్యక్ర‌మాలుగా కాకుండా సామాజిక ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకుని ప‌ని చేస్తేనే లింగ వివ‌క్ష తొల‌గిపోతుంది.

రాకెట్ సైన్‌్‌లో అగ్ర‌గామి దేశాల స‌ర‌స‌న ఉన్న భార‌త దేశం సామాజిక జీవితంలో ఎంత వెనుక‌బ‌డి ఉందో లింగ స‌మాన‌త చూపిస్తోంది. ఐక్య‌రాజ్య స‌మితి అభివృద్ధి కార్య‌క్ర‌మం (యూఎన్‌డీపీ) విడుద‌ల చేసిన లింగ అస‌మాన‌త సూచీలో భార‌త దేశం 108వ స్థానంలో ఉంది. ఇది అత్యంత విషాదం. నాలుగ‌వ అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఉన్న దేశంలో ఇంత వివ‌క్ష ఎందుకు గ‌డ్డ‌క‌ట్టుకుపోయిందో మ‌నం ఆలోచించాలి. మ‌హిళా దినోత్స‌వాలు, మ‌హిళాభ్యుద‌య స‌మావేశాలు అనేక రంగాల్లో మ‌హిళ‌ల విజ‌యాల‌ను గుర్తు చేస్తాయి. దేశంలో అన్ని రంగాల్లో మ‌హిళ‌లు అడుగుపెట్టారు. అయినా లింగ అస‌మాత‌న‌లో ఇంత వెనుబాటు ఎందుకుంది? ఇది మ‌న కుటుంబ సంబంధాలు, సామాజిక విలువ‌లు, సాంస్కృతిక జీవితంలో ఉన్న పితృస్వామ్యాన్ని సూచిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హిళా సాధికార‌త అంటే ఉపాధి, ఉద్యోగావ‌కాశాలుగానే చూస్తున్నారు. ఉద్యోగాలు చేసే మ‌హిళ‌లు ఇంటా, బ‌య‌టా వివ‌క్ష‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఉన్న‌త చ‌దువులు, ఉద్యోగాల్లో ఉన్న మ‌హిళ‌ల‌పై కుటుంబాల్లో ఆంక్ష‌లు పెరుగుతున్నాయి. ఈ సాంస్కృతిక జీవితంలో సంపూర్ణ‌మైన సాధికార‌త‌ను సాధించ‌లేము. స్త్రీల‌ను గౌర‌వించ‌డం, వాళ్ల అభిప్రాయాల‌ను, నిర్ణ‌యాల‌ను, అభిరుచుల‌కు గౌర‌వ‌భావం పెరిగేలా విద్య‌, సాహిత్యం, క‌ళ‌లు, చ‌ట్టాల ద్వారా కృషి జ‌ర‌గాలి. సాంస్కృతిక చైత‌న్యం ద్వారానే స్త్రీల సామాజిక హోదా పెరుగుతుంది. స్త్రీలే కాదు పురుషులూ చైత‌న్యం అయిన‌ప్పుడే స్త్రీల‌కు ర‌క్షణ‌, వారి ప్ర‌తిభ‌కు ప్రోత్సాహం, గుర్తింపు ఉంటుంది. అప్పుడే సంపూర్ణ సాధికార‌త సాధ్య‌మ‌వుతుంది.

ఇరాన్ పై సామ్రాజ్యవాద అమెరికా, ఇజ్రాయిల్ దాడిని ఖండించండి: సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

దేశంలో జ‌రుగుతున్న అభివృద్ధిలో అవ‌కాశాల‌ను మ‌హిళ‌లు అందుకోలేక‌పోతున్నారు. మ‌న దేశ జ‌నాభాలో అర‌వై శాతం మంది గ్రామాల్లో ఉన్నారు. గ్రామీణ మ‌హిళ‌లకు వ్య‌వ‌సాయ‌మే జీన‌వ‌నాధారం. వ్య‌వ‌సాయ కూలీల్లో ఎన‌భై శాతం మ‌హిళ‌లే ఉన్నారు. పురుగుమందులు, వాతావ‌ర‌ణ మార్పుల వ‌ల్ల పెరుగుతున్న వేడిలో వాళ్ల జీవితాలు కాలిపోతున్నాయి. ప‌గ‌టి ఉష్నోగ్ర‌త‌ల్లో వ‌చ్చిన మార్పులు వాళ్లను రోగాల పాలు చేస్తున్నాయి. కిడ్నీ స‌బంధ స‌మ‌స్య‌లు, చ‌ర్మ క్యాన్స‌ర్లు పెరుగుతున్నా క‌నీస అవ‌గాహ‌న లేక వాళ్ల ప్రాణులు కోల్పోయే ప‌రిస్థితుల్లో ఉన్నారు. అభివృద్ధిని కొద్ది న‌గ‌రాల చుట్టూ కేంద్రీక‌రించ‌డం వ‌ల్ల ఆ అవ‌కాశాల‌ను దూర ప్రాంత మ‌హిళ‌లు అందిపుచ్చుకోలేక‌పోతున్నారు. ర‌వాణా సేవ‌లు లేక‌పోవ‌డం, వ‌ల‌స‌పోయే జీవించ‌డానికి అనుమ‌తి లేక‌పోవ‌డం మ‌హిళ‌ల అవ‌కాశాల్ని దెబ్బ‌తీస్తోంది. కాబ‌ట్టి పారిశ్రామికాభివృద్ధి వికేంద్రీక‌రించాలి. ఇది చిన్న ప‌ట్ట‌ణాలు, గ్రామాల మ‌హిళ‌ల‌కు ఉద్యోగ అవ‌కాశాల‌ను పెంచుతుంది. ఇందువ‌ల్ల ప‌రిశ్ర‌మ‌లు, సేవ‌ల రంగాల్లో మ‌హిళ‌ల భాగ‌స్వామ్యం పెరుగుతుంది.

అవార్డులు, స‌న్మానాలతో ప్ర‌భుత్వాల వేడుక‌లు, కొన్ని సందేశాలు స‌మాజాన్ని పూర్తిగా మార్చ‌లేవు. మ‌హిళోద్య‌మ‌మ స్ఫూర్తి మ‌హిళల జీవితాన్ని సంతోష‌మ‌యం చేయ‌డం. స్వేచ్ఛ‌, స‌మాన‌త్వం సాధించ‌డం. కాబ‌ట్టి కొంద‌రి విజ‌యాల‌తోనే ప్ర‌భుత్వాలు మ‌హిళాభ్యుద‌యాన్ని చాటుతున్నాయి. ప్ర‌జ‌లంద‌రి సుఖ‌, సంతోషాలు ప్ర‌భుత్వాల‌ బాధ్య‌త. లింగ అస‌మాన‌త సూచీలో వెనుక‌బాటుకు గురించి, మహిళ‌ల‌కు మెరుగైన జీవితం గురించి ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వాలు మాట్లాడాలి. మ‌హిళ‌లు పురుషుల‌తో స‌మానంగా జీవించ‌గ‌లిగే అవ‌కాశాలు క‌ల్పించాలి. మ‌హిళాభ్యుద‌యం అన‌గానే ఎక్కువ‌గా సంప‌న్న మ‌హిళ‌లు సాధించిన విజ‌యాల‌తోనే కొలుస్తున్నాయి. దేశంలో పోష‌కాహార లోపం మ‌హిళ‌ల్లో అధికంగా ఉంది. ర‌క్త హీన‌తతో బాధ‌ప‌డే మ‌హిళ‌లు కోట్లాది మంది ఉన్నారు. భార‌త దేశ మ‌హిళ‌ల్లో 50 శాతం కంటే ఎక్కువ‌మంది ర‌క్త హీన‌త‌తో బాధ‌ప‌డుతున్నారు. స‌రైన ఆహారం తిన‌లేని స్థితిలో దేశ మ‌హిళ‌లు ఉన్నారు. మ‌ద్యం ద్వారా ఆదాయాలు పెంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న ప్ర‌భుత్వాలు పోష‌కాహార లోపాన్నీ నివారించేందుకు ల‌క్ష్యాన్ని నిర్ధేశించుకోవాలి.

మహిళా సాధికారత కోసం.. గివ్ టూ గైన్.

గ్రామీణుల ఆదాయాలు ప‌డిపోవ‌డం, వ్య‌వ‌సాయ రంగంలో సంక్షోభం స్త్రీల జీవితాల‌ను దుఃఖ‌మ‌యం చేస్తోంది. రైతు ఆత్మ‌హ‌త్య‌లు ఎంద‌రో మ‌హిళ‌ల్ని ఒంటిరి జీవితంలోకి నెడుతున్నాయి. ప్ర‌భుత్వాలు ప‌రిహారం ఇవ్వ‌ట్లేదు. వారి పిల్ల‌ల‌కు విద్య‌ను అందించే బాధ్య‌నూ తీసుకోవ‌ట్లేదు. పిల్ల‌లు చ‌దువు, ఆరోగ్యం, పోష‌ణ ఒంట‌రి మ‌హిళ‌ల‌పై తీవ్ర‌మైన భారాన్ని మోపుతోంది. మాన‌సిక సంక్షోభంలో ఉన్న మ‌హిళ‌లు మ‌రింత పేద‌రికంలోకి దిగ‌జారుతున్నారు. ప్ర‌కృతి వైఫ‌రీత్యాల వ‌ల్ల పంట న‌ష్ట‌పోవ‌డం, న‌కిలీ విత్త‌నాలు, పురుగుముందులు మిగిల్చే విషాదం స్త్రీల జీవితాల‌ను చిదిమేస్తోంది. మ‌హిళాభ్యుద‌యంగా కేవ‌లం పారిశ్రామిక రంగంలోని మ‌హిళ‌లు, సాహిత్యం, క‌ళా రంంగాల్లోని మ‌హిళ‌ల్ని గుర్తించ‌డ‌మే అనుకునే ప్ర‌భుత్వాలు క‌ళ్లు తెరవాలి. మ‌హిళా రైతులు, వ్య‌వ‌సాయ కూలీ మ‌హిళ‌లు, ప‌ట్ట‌ణాల్లో ఇంటి ప‌ని చేసే మ‌హిళ‌లు, అసంగ‌టిత రంగాల్లో ప‌నిచేసే మ‌హిళ‌లు శ్ర‌మ దోపిడీకి గుర‌వుతున్నారు. వాళ్ల ర‌క్ష‌ణ‌, జీవ‌న భ‌ద్ర‌త గురించి ప్ర‌భుత్వాల స‌భ‌లు, చ‌ర్చ‌లు జ‌ర‌ప‌ట్లేదు. అంత‌ర్జాతీయ శ్రామిక మ‌హిళా దినోత్స‌వ స్ఫూర్తిని ప్ర‌భుత్వాలే నీరుగారుస్తున్నాయి. వ్య‌వ‌సాయం, చేతివృత్తుల సంక్షోభం వ‌ల్ల‌, అసంఘ‌టిత రంగంలో త‌క్కువ వేత‌నాల వ‌ల్ల మ‌హిళ‌ల జీవితం దుర్భ‌ర‌మ‌వుతోంది. ఈ లెక్క‌లు తీయ‌కుండా వాళ్ల జీవితాల‌ను మార్చ‌కుండా మ‌హిళ‌లు పురోగ‌మిస్తున్నార‌ని కొంద‌రిని ప్ర‌చారంలో పెట్ట‌డం ద్వారా లింగ అస‌మాన‌త‌ను త‌గ్గించ‌లేరు. మ‌హిళాభ్యుద‌యం సాధించ‌లేరు.

  • రోజా నాగ‌పురి,
  • సామాజిక విశ్లేషకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *