కరీంనగర్, మార్చి 29, నేటి తెలుగు పత్రిక: ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ యూజీ విద్యార్థులచే వైద్య విద్యార్థుల కోసం నిర్వహించిన అండర్‌గ్రాడ్యుయేట్ మెడికల్ కాన్ఫరెన్స్ “ప్రాణా–2026” ఘనంగా విజయవంతమైంది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో విద్యార్థులు తమ వైద్య పరిజ్ఞానం, పరిశోధనా ఆలోచనలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలను ప్రదర్శించారు. రెండవ రోజు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ ఇలాంటి ప్రతిష్టాత్మక సదస్సులో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందన్నారు. మెడికల్ విద్యార్థులు రేపటి డాక్టర్లు కావడంతో, ప్రాక్టికల్ జ్ఞానం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి సమావేశాలు భవిష్యత్ కెరీర్‌కు మేలు చేస్తాయని అన్నారు. ఇటీవల పోలీస్ విభాగంలో కూడా ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నానని, “ఎమర్జింగ్ క్రైమ్స్” అంశంపై 2047 నాటికి ఎదురయ్యే సవాళ్లపై ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు వివరించారు.
ప్రతిమ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ హాసిని మాట్లాడుతూ… “ప్రాణా” అంటే జీవశక్తి, ఉత్సాహం, లక్ష్యం — ఈ మూడు విలువలను మీరు అందరూ ఆచరణలో చూపించారని డాక్టర్ హాసిని పేర్కొన్నారు. ఈ రెండు రోజులలో కేవలం ఆలోచనలు పంచుకోవడం మాత్రమే కాకుండా, ప్రతి ఒక్కరూ ఒక కొత్త దిశలో ఆలోచిస్తూ, కేవలం డాక్టర్లుగానే కాకుండా, ఆలోచనాపరులు (Thinkers), నవీనతను తీసుకొచ్చే వారు (Innovators), నాయకులుగా (Leaders) ఎదిగారన్నారు. ప్రెజెంటేషన్లు, చర్చలు, అర్థవంతమైన సంభాషణల ద్వారా ఆత్మవిశ్వాసం, సహకారం, సృజనాత్మకత స్పష్టంగా కనిపించాయని ఇక్కడ మీరు నేర్చుకున్న సంబంధాలు, జ్ఞానం, టెక్నాలజీ ఇవన్నీ కేవలం మీకు సహాయం చేయడానికే కాదు, భవిష్యత్తులో మెరుగైన ఆరోగ్య సేవలను అందించేందుకు ఉపయోగపడాలన్నారు. కార్యక్రమంలో నిపుణులు వైద్య రంగంలో తాజా అభివృద్ధులు, నైపుణ్యాల ప్రాముఖ్యత, రోగి సేవలో నైతిక విలువలపై ప్రసంగించారు. విద్యార్థులను కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, పరిశోధన, నాయకత్వ లక్షణాలు, సమగ్ర వైద్య సేవల వైపు దృష్టి సారించాలని ప్రోత్సహించారు.
అనంతరం డాక్టర్ హాసిని సిపి గౌస్ ఆలం చేతులమీదుగా విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు.ఈ సందర్భంగా ప్రతిమ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ హాసిని సిపి గౌస్ ఆలంకు మెమెంటో ప్రధానం చేసి శాలువాతో సత్కరించారు.
కార్యక్రమంలో డా. జాన్ ఇజ్రాయెల్ (ప్రిన్సిపల్), రామచందర్ రావు (సీఏఓ), మెడికల్ సూపరింటెండెంట్ డా. సి. ఎన్. ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ డా. కిషన్ రెడ్డి, రిజిస్ట్రార్ కమ్ అడ్మిన్ ప్రసాద్ రావు, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు డా. అమిత్ (పిడియాట్రిక్స్ హెచ్‌ఓడీ), డా. ప్రణయ్, డా. సంద్యా, డాక్టర్ టికేకే నాయకుడు osd, ఫ్యాకల్టీ బృందం, వివిధ డిపార్మెంట్ల వైద్య బృందం, సిబ్బంది మరియు వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.
