Breaking News

దార్శనికత, నమ్మకం, వేగానికి ప్రతిరూపం “ SAEL ” సోలార్ ప్రాజెక్టు: మంత్రి నారా లోకేష్

మా బ్రాండ్ జాబ్ క్రియేషన్… మీ బ్రాండ్ గొడ్డ‌లి

బ్రాండ్ చంద్రబాబు వల్లే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పరుగులు

మాటిచ్చి చేత‌ల్లో చూపే నాయకత్వంవల్లే పెట్టుబడుల వెల్లువ

క్లీన్ ఎనర్జీ వినియోగించడమే కాదు… దేశానికి ఎగుమతి చేస్తాం

సేల్ సోలార్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభలో మంత్రి నారా లోకేష్

మంగళగిరి మే 22 ( నేటి తెలుగుదిన పత్రిక ప్రతినిధి): ఈరోజు కేవలం ఒక సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం మాత్రమే కాదు, దార్శనికత, నమ్మకం, వేగం, కార్యనిర్వహణ కలగలిసిన వేడుక అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం టి.కొండూరు గ్రామంలో రూ.3వేలకోట్లతో నిర్మించిన సుఖ్ బీర్ ఆగ్రో ఎనర్జీ లిమిటెడ్ (SAEL) వారి 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… “మా నాన్న ఉత్తరం రాశారు.. మా తాత కల కన్నారు.. నేను ఆత్మలతో మాట్లాడాను అంటే నమ్మే వాళ్ళు ఎవరు లేరు బ్రదర్. మా బ్రాండ్ జాబ్ క్రియేషన్… మీ బ్రాండ్ గొడ్డలి.” రెండింటికీ ఎంతో తేడా ఉందని అన్నారు.

రాష్ట్రం చూపు.. జ‌మ్మ‌ల‌మ‌డుగు వైపు

రికార్డ్ టైమ్ లో SAEL ప్రాజెక్ట్ పూర్తి అయింది. ఇది స్థానిక రైతుల విజయం, జమ్మలమడుగు యువత విజయం. మీ సహకారం వల్లనే ఈ ప్రాజెక్ట్ 11 నెలల్లో పూర్తి అయింది. రాష్ట్రం మొతం జమ్మలమడుగు వైపు చూస్తోంది. ఈరోజు ఇతర నియోజకవర్గాల వాళ్ళు మాకు కూడా ఇటువంటి కంపెనీలు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఇక్కడ మెగా సోలార్ పార్క్ ఏర్పాటు చేసింది మనమే. ఇప్పుడు SAEL తీసుకువచ్చింది మనమే. అదానీ, చింతా గ్రీన్, జెన్‌కో – NTPC పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌లు తీసుకొచ్చింది మనమే. SAEL రావడం వల్ల రైతులకు లబ్ధి జరిగింది, యువతకు ఉద్యోగాలు వచ్చాయి. కంపెనీలు తీసుకురావాలన్నా, ఉద్యోగాలు కల్పించాలన్నా అది ఒక్క మన బ్రాండ్ చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని అన్నారు.

విజ‌యానికి మూడు మెట్లు

మంత్రి నారా లోకేష్ చొరవతో ఎస్ఎల్ఎన్ కాలనీలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి పార్క్ అభివృద్ధి

పెట్టుబ‌డుల సాధ‌న‌, ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌, ఉద్యోగాల క‌ల్ప‌న‌లో ఏపీ విజ‌యానికి ముఖ్య‌మైన మూడు కార‌ణాలున్నాయి. అవి ఏంటంటే.. మొదటిది — బ్రాండ్ సీబీఎన్. “పెట్టుబడిదారులు ఇప్పుడు మేము ఎంత త్వరగా ఆంధ్రప్రదేశ్‌కు రాగలం?” అని అడుగుతున్నారు. ఎందుకంటే, ఇచ్చిన మాటను చేతల్లో చూపే నాయకత్వంతో నిర్మితమైన ఆంధ్రప్రదేశ్ నేడు ఒక గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగింది. రెండవది — స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌. మేము స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను నమ్ముతాం. నిర్ణయాలు వేగంగా తీసుకుని, ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేసినప్పుడే విధానాలకు విలువ ఉంటుంది. ఈ ప్రాజెక్టే అందుకు నిదర్శనం. ప్రాజెక్ట్ భూమిపూజ నుండి ప్రారంభోత్సవం వరకు రికార్డు స్థాయిలో 11 నెలల్లో పూర్తయింది. మూడవది — డ‌బుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ స‌ర్కార్‌. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ మద్దతుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానం మరింత వేగవంతమైంది. మాది డబుల్-ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. రాష్ట్రప్రభుత్వ దార్శనికతకు కేంద్ర ప్ర‌భుత్వ‌ మద్దతు తోడైన‌ప్పుడు అభివృద్ధి ప‌రుగులు పెడుతుంది.

ప్రపంచంతో పోటీపడే ఎకోసిస్టమ్ నిర్మాణం

ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్‌వేర్, డ్రోన్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా, అధునాతన తయారీ వంటి రంగాల్లో 22 ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను నిర్మిస్తోంది. ఆధునిక ఆర్థిక వృద్ధి ఎకోసిస్టమ్స్, స్పెషలైజేషన్, ఆవిష్కరణల ద్వారానే సాధ్యమవుతుంది. ఆంధ్రప్రదేశ్, భారత ప్రభుత్వం కలిసి భవిష్యత్తు కోసం ప్రపంచవ్యాప్తంగా పోటీపడగల ఎకో సిస్టమ్స్ ను నిర్మిస్తున్నాయి. SAEL నాయకత్వంతో మొట్టమొదటి సంభాషణ నాకు ఇప్పటికీ గుర్తుంది. ఢిల్లీలో ఒక టెలికాం ఆపరేటర్ల సంఘం సమావేశం సందర్భంగా జరిగింది. అది పునరుత్పాదక ఇంధనానికి సంబంధించిన సమావేశం కూడా కాదు. కానీ ఆరోజు ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను నిర్మించాలనే తమ ప్రణాళికల గురించి SAEL నాయకత్వం ఎంతో ఉద్వేగంగా మాట్లాడింది. వారి ఉద్దేశాన్ని నేను వెంటనే గ్రహించాను. రెన్యువబుల్ ఎనర్జీలో ఫలితాలను సాధించాలన్న SAEL సంస్థ దీర్ఘకాలిక ఆలోచన, వారి తపనను నేను పసిగట్టగలిగాను.

స్థానిక సమాజంతో కలసి ముందడుగు

పంజాబ్ లీడర్ షిప్ నేతృత్వంలో పనిచేస్తున్న ఢిల్లీకి చెందిన ఒక కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో కార్యకలాపాలు నిర్వహించగలదా? అనే ప్ర‌శ్న నాలో మెదిలింది. SAEL బృందం అమరావతికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారిని, నన్ను కలిశారు. క్షేత్రస్థాయిలో పనిచేయడానికి సిద్ధమై, స్ప‌ష్ట‌మైన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌తో రావ‌డం నా ప్ర‌శ్న‌కు జ‌వాబు దొరికింది. SAEL బృందం చక్కగా స్థానిక సమాజం, ప్రజలతో మమేకమయ్యారు. క్షేత్ర‌స్థాయిలో గ్రామస్థులు, రైతులు, స్థానిక యంత్రాంగం, ఇంజనీర్లు, కార్మికులు, అధికారులతో కలిసికట్టుగా పనిచేశారు. వారు క్షేత్రస్థాయికి వచ్చి, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని, స్థానికుల సహకారంతో ముందుకు సాగారు. ఆ స్ఫూర్తే ఈ ప్రాజెక్టును విజయవంతం చేసింది.

రికార్డువేగంతో ప్రాజెక్టు పూర్తి

SAEL ₹3,000 కోట్ల పెట్టుబడి పెట్టి, 2,400 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో MHP1, MHP2 భారీ 300 మెగావాట్ల ప్రాజెక్టుల నిర్మాణం 11 నెలల్లో వేగవంతంగా పూర్త‌యి రికార్డు సృష్టించింది. పంజాబ్, రాజస్థాన్‌లోని SAEL సొంత ప్లాంట్లలో తయారైన‌ 12 లక్షలకు పైగా అధునాతన టాప్‌కాన్ బైఫేషియల్ సోలార్ మాడ్యూల్స్ ఏర్పాటుచేశారు.

11లక్షల టన్నుల కర్బన ఉద్గారాల తగ్గుదల

ఈ ఒక్క ప్రాజెక్ట్ ద్వారానే ఏటా సుమారు 11 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను నివారించవచ్చని అంచనా. ఇక్కడ ఉత్పత్తి అయ్యే స్వచ్ఛమైన విద్యుత్, సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాతో కుదిరిన 25 ఏళ్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రకారం జాతీయ గ్రిడ్‌లోకి సరఫరా అవుతుంది. ఈ విద్యుత్ గుజరాత్‌తో సహా ఇతర రాష్ట్రాలకు కూడా ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కేవలం క్లీన్ ఎనర్జీని వినియోగించడమే కాదు, భారతదేశానికి ఎగుమతి చేసే రాష్ట్రంగా ఎదుగుతోంది. భారతదేశ హరిత ఇంధన విప్లవానికి నాయకత్వం వహించడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉంది. SAEL బృందం మొత్తానికి, ముఖ్యంగా పంజాబ్ నుండి వచ్చిన మన సోదర సోదరీమణులకు నేను చెప్పేది ఒక్కటే. “తుస్సీ కమాల్ కర్ దిట్టా…చక్ దే ఫట్టే!” ఆంధ్రప్రదేశ్ మిమ్మల్ని కుటుంబ సభ్యులుగా స్వాగతిస్తోంది. క్రమశిక్షణ, పట్టుదల, వేగంతో ఎలా సాధించగలమో మీరు ఆచరణాత్మకంగా నిరూపించారు.

పెద్దవాగు ప్రాజెక్టు పునర్నిర్మాణానికి రూ.500 కోట్లు కేటాయించాలి

నిర్మాణ సమయంలోనే వెయ్యిమందికి ఉపాధి

ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే 1,000 మందికి పైగా కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ‌-ఉపాధి ల‌భించింది. వీరిలో 80 శాతం మంది స్థానికులే. వీరి ఆదాయాలు మెరుగయ్యాయి. చుట్టుపక్కల గ్రామాల్లో ఆర్థిక కార్యకలాపాలు విస్తరించాయి. అన్నింటికన్నా ముఖ్యంగా, దీర్ఘకాలిక లీజు ఒప్పందాల ద్వారా 760 మంది రైతులు, వారి కుటుంబాలు లబ్ధి పొందాయి.

వ్య‌వ‌సాయ వ్య‌ర్థాల నుంచి విద్యుత్‌

రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ వ్యర్థాల నుండి దాదాపు 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేవి SAEL ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. ఇవి రైతులకు అదనపు ఆదాయ అవకాశాలను కల్పిస్తాయి. పునరుత్పాదక ఇంధన రంగంలో ఇవి వేలాది ఉద్యోగాలను సృష్టిస్తాయి.

మరిన్ని పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్నాం

SAEL బృందం వారి రాబోయే ఐపీవో ప్రయాణంలో, భారతదేశం అంతటా వారి భవిష్యత్ విస్తరణ ప్రణాళికలలో గొప్ప విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాం. నిరాటంకమైన కార్యకలాపాలు, భవిష్యత్ విస్తరణ కోసం మన స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం, సంబంధిత శాఖలన్నీ పూర్తి మద్దతును కొనసాగించాలని విజ్జప్తి చేస్తున్నాను. SAEL సంస్థకు ఏ మ‌ద్ద‌తు కావాల‌న్నా నేను ఒక్క వాట్సాప్ కాల్ దూరంలోనే ఉంటానని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి సవిత, కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, సేల్ (SAEL) కో-ఫౌండర్ & డైరెక్టర్ సుఖ్ భీర్ సింగ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & సీఈవో లక్షిత్ ఆవ్లా, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇంఛార్జ్ భూపేష్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *