హైదరాబాద్, మే 31, (నేటి తెలుగు పత్రిక): పండుగల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో మాంసం విక్రయాలపై ఆంక్షలు విధిస్తున్నట్లే, రంజాన్ మాసంలో మద్యం అమ్మకాలపై కూడా నిషేధం విధించగలరా అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు సామాజిక, రాజకీయ అంశాలపై స్పందించారు.ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ, ఒక మతానికి సంబంధించిన ఆచారాలు, భావోద్వేగాలను గౌరవించే విధంగా నిర్ణయాలు తీసుకుంటే, అదే ప్రమాణాలు అన్ని మతాల విషయంలోనూ అమలు కావాలని అన్నారు. రంజాన్ పవిత్ర మాసంలో మద్యం విక్రయాలపై కూడా ప్రభుత్వం స్పష్టమైన వైఖరి వెల్లడించాలని కోరారు.రోడ్లపై నమాజ్ నిర్వహించడంపై వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ, అది తప్పు అని భావిస్తే రోడ్లపై జరిగే అన్ని మతపరమైన కార్యక్రమాలు, పండుగలపైనా ఒకే విధమైన నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. చట్టం అందరికీ సమానంగా ఉండాలే తప్ప, ఎంపిక చేసిన సందర్భాల్లో మాత్రమే అమలు చేయకూడదని అన్నారు.అలాగే అసోంలో అమలవుతున్న యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) అంశాన్ని ప్రస్తావించిన ఆయన, గిరిజన వర్గాలకు మినహాయింపులు ఇస్తూనే ముస్లింలపై కొన్ని నిబంధనలు రుద్దుతున్నారని విమర్శించారు. అన్ని వర్గాల సంప్రదాయాలు, మతపరమైన ఆచారాలను గౌరవించే విధానమే ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణమని పేర్కొన్నారు.దేశంలో సామాజిక సామరస్యం, పరస్పర గౌరవం పెంపొందించే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించాలని, మతాల మధ్య విభేదాలు సృష్టించే చర్యలను నివారించాలని ఒవైసీ సూచించారు.
