జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం గింజేరులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రాష్ట్రవ్యాప్తంగా 62.34 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తున్నట్లు వెల్లడించారు.
జూన్ నెల పెన్షన్ల చెల్లింపుల కోసం ప్రభుత్వం రూ.2,728 కోట్లు విడుదల చేసిందని మంత్రి చెప్పారు. అలాగే జూన్ నుంచి కొత్తగా 5,606 మంది జీవిత భాగస్వామి పెన్షన్ లబ్ధిదారులను చేర్చామని, వారి కోసం రూ.2.24 కోట్లు ప్రత్యేకంగా కేటాయించినట్లు పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు పెన్షన్ల పంపిణీ కోసం రికార్డు స్థాయిలో రూ.65,886.57 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
