Breaking News

పట్టాభిపురం రైతు బజార్‌కు ఆధునిక హంగులు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

మే 15, (నేటి తెలుగు పత్రిక): గుంటూరు నగరంలోని పట్టాభిపురం రైతు బజార్‌ను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దాదాపు రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన జీ ప్లస్ టూ భవనానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులకు, వినియోగదారులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. తొమ్మిది నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. సుమారు 11 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఈ భవనంలో మొత్తం 100 షాపులు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 60 షాపులను రైతులకు, మరో 30 షాపులను డ్వాక్రా మహిళల ఉత్పత్తుల విక్రయానికి కేటాయించనున్నారు.వినియోగదారుల సౌకర్యార్థం విశాలమైన పార్కింగ్, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, మెరుగైన పారిశుద్ధ్య ప్రమాణాలతో బజార్‌ను రూపుదిద్దుతున్నారు. రైతులు నేరుగా తమ ఉత్పత్తులను విక్రయించుకునేలా అన్ని వసతులు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, మిర్చి యార్డ్ ఛైర్మన్ కుర్రా అప్పారావు తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

రాయలసీమను గ్రోత్ జోన్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు

వైసీపీ ఆందోళనలపై బైరెడ్డి శబరి విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *