మే 15, (నేటి తెలుగు పత్రిక): శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భారీ రక్షణ రంగ ప్రాజెక్టులకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రూ.15,803 కోట్ల వ్యయంతో చేపడుతున్న అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్టు ద్వారా ఆధునిక యుద్ధ విమానాల తయారీకి మార్గం సుగమం కానుంది. పుట్టపర్తి–కోడూరు రోడ్డులోని 130 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ డిఫెన్స్ పరిశ్రమ దేశ రక్షణ రంగంలో కీలక కేంద్రంగా అభివృద్ధి చెందనుందని అధికారులు తెలిపారు. అదేవిధంగా రూ.480 కోట్ల పెట్టుబడితో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) యూనిట్‌ను కూడా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఆధునిక యుద్ధరంగంలో డ్రోన్ టెక్నాలజీ గేమ్ ఛేంజర్‌గా మారిందన్నారు. రక్షణ రంగంతో పాటు వ్యవసాయం, ఆర్థిక రంగాల్లో కూడా డ్రోన్ల వినియోగం విస్తరిస్తోందని పేర్కొన్నారు.ఆయుధ ఉత్పత్తిలో స్వావలంబన సాధించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, రక్షణ రంగంలో ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు గత పదేళ్లుగా కృషి చేస్తున్నామని తెలిపారు. కర్నూలును దేశంలో ప్రముఖ డ్రోన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి కేంద్రం చర్యలు చేపడుతోందని వెల్లడించారు.
