మే 17, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత రంగానికి స్వర్ణయుగం ప్రారంభమైందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో సంక్షోభంలో ఉన్న నేతన్నల జీవితాల్లో ఇప్పుడు కొత్త ఆశలు నింపేలా ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు.చేనేత కార్మికుల ఆత్మగౌరవాన్ని పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, “నేను కూలీని కాదు.. కళాకారుడిని” అనే స్థాయికి నేతన్నలను తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో చేనేత రంగాన్ని బలోపేతం చేస్తున్నామని చెప్పారు.
నేతన్నలకు ప్రధాన ప్రయోజనాలు
- నేతన్నల పెన్షన్‌ను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంపు
- మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు, మరమగ్గం నేతన్నలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్
- నూలు కొనుగోలుపై 15 శాతం సబ్సిడీ
- చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ నిర్ణయం
- మహిళా చేనేత కార్మికులకు రూ.10 వేల విలువైన నూలు పంపిణీ
- ఆధునిక పనిముట్ల కొనుగోలుకు 90 శాతం వరకు సబ్సిడీ
ప్రభుత్వం చేనేత సహకార సంఘాలకు ఆర్థిక సాయం అందించడంతో పాటు ముద్ర రుణాల ద్వారా వేలాది మంది నేతన్నలకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లు వెల్లడించింది.
మంగళగిరి చేనేతకు అంతర్జాతీయ గుర్తింపు
మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరి చేనేతకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పెరిగిందని ప్రభుత్వం పేర్కొంది. యువత అభిరుచులకు తగ్గట్టు కొత్త డిజైన్లతో చేనేత వస్త్రాల తయారీకి ప్రత్యేక శిక్షణలు కూడా ఇస్తున్నారు.
ఆన్‌లైన్‌లో చేనేత విక్రయాలు
ఆప్కో షోరూమ్‌లు, ఈ-కామర్స్ వేదికల ద్వారా చేనేత వస్త్రాల అమ్మకాలను విస్తరించారు. రాష్ట్రవ్యాప్తంగా 40 ఆప్కో షోరూమ్‌ల ద్వారా వేలాది ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకొచ్చారు.చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ.. నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో చేనేత రంగం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
