Breaking News

ఎబోలా వైరస్‌పై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం

మే 24, (నేటి తెలుగు పత్రిక): ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు విమానాశ్రయాలు, పోర్టులు, సరిహద్దు ప్రాంతాల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల్లో ప్రత్యేక స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రయాణికుల ట్రావెల్ హిస్టరీ ఆధారంగా ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. అనుమానాస్పద లక్షణాలు కనిపించిన వారిని వెంటనే క్వారంటైన్‌కు తరలించేలా చర్యలు చేపట్టారు. విశాఖ పోర్టుతో పాటు రోడ్డు మార్గాల ద్వారా రాష్ట్రంలోకి వచ్చే వారిపైనా ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోంది.ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. కొవిడ్ సమయంలో వచ్చిన అనుభవాల ఆధారంగా ఎబోలా నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ, విమానాశ్రయ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న ప్రాంతాల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయడంతో పాటు టీచింగ్ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా 15 పడకల వార్డులను సిద్ధం చేశామని వెల్లడించారు.అవసరమైన పీపీఈ కిట్లు, వైరస్ నిర్ధారణ పరీక్షా కిట్లు తగినంతగా అందుబాటులో ఉంచినట్లు మంత్రి తెలిపారు. గ్రామీణ స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఎబోలా లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.అత్యవసరం అయితే తప్ప ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలు చేయవద్దని ప్రజలకు ప్రభుత్వం సూచించింది. గత మూడు వారాల్లో ఆ దేశాల నుంచి వచ్చిన వారు ఆరోగ్య పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని కోరింది. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వాంతులు, విరేచనాలు, కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని మంత్రి సత్యకుమార్ సూచించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *