గుంటూరు జిల్లా, మే 25, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టడమే జగన్ అండ్ కో పని అని ఆరోపించారు. వైసీపీ పాలనలో బడుగు, బలహీన వర్గాలపై దాడులు జరిగాయని మండిపడ్డారు.సోమవారం గుంటూరు జిల్లాలో పర్యటించిన ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పలు కార్యక్రమాల్లో పాల్గొని మీడియాతో మాట్లాడారు. ప్రజావ్యతిరేక విధానాల కారణంగానే వైసీపీని ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని వ్యాఖ్యానించారు.ప్రజల తీర్పు వచ్చిన తర్వాత కూడా వైసీపీ నేతల్లో మార్పు కనిపించడం లేదని ఆయన అన్నారు. వివాదాలు సృష్టించి యువతను కేసుల్లో ఇరికిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్ అండ్ కో పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.వైసీపీ పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలు దెబ్బతిన్నాయని, జడ్జిలు మరియు వారి కుటుంబ సభ్యులపై కూడా దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. మాట వినలేదనే కారణంతో అనేకమందిపై దాడులు జరిగాయని, ప్రజలు అధికారం ఇవ్వలేదనే అసహనంతోనే వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.మొక్కజొన్న రైతుల సమస్యలపై స్పందిస్తూ.. రైతులకు న్యాయం చేయాలని అడగడంలో తప్పులేదన్నారు. రైతుల పేరుతో దీక్షలు చేసి సంగం డెయిరీపై విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. గత 15 ఏళ్లుగా డెయిరీ అవసరాల కోసం మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.ప్రభుత్వాలపై ఆధారపడి తాము వ్యాపారం చేయడం లేదని స్పష్టం చేసిన ధూళిపాళ్ల.. మొక్కజొన్న కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని చెప్పారు.రాజకీయ లబ్ధి కోసం జగన్ రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించిన ఆయన.. మహిళలను రెచ్చగొట్టి వారిపైనే కేసులు వచ్చేలా చేస్తున్నారని ఆరోపించారు. అంబటి మురళి రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలను ఉపయోగిస్తున్నారని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
