మే 30, (నేటి తెలుగు పత్రిక): మెగా హీరో రామ్ చరణ్ నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పెద్ది’ విడుదలకు ముందు టికెట్ ధరల పెంపు అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే తెలంగాణలో ఈ సినిమాకు ప్రత్యేకంగా టికెట్ ధరలు పెంచే అవకాశాలు దాదాపు లేకపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో సినిమా సాధారణ ధరలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే పరిస్థితి ఏర్పడింది.సినిమా టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వాలని చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పటికే రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శికి రెండుసార్లు లేఖలు పంపినట్లు సమాచారం. కానీ ప్రభుత్వ నుంచి ఎలాంటి స్పష్టమైన స్పందన రాకపోవడంతో నిర్మాతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ధరల పెంపుపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ అంశంపై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం అవసరమని కోర్టును కోరారు. దీంతో తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.అయితే సినిమా విడుదల జూన్ 4న ఉండటంతో విచారణ పూర్తయ్యేలోపే చిత్రం థియేటర్లలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో టికెట్ ధరల పెంపుపై తక్షణ ఉపశమనం లభించే అవకాశం లేకపోవడంతో నిర్మాతలు తమ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు సమాచారం.దీంతో తెలంగాణలో ‘పెద్ది’ సినిమా సాధారణ టికెట్ ధరలతోనే విడుదలయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ప్రత్యేక షోలు, అదనపు ధరల అనుమతులపై కూడా స్పష్టత లేకపోవడంతో ప్రేక్షకులు సాధారణ రేట్లకే సినిమా చూసే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
