ప్రతిపక్ష నాయకుడిగా తన హక్కులను మోదీ సర్కారు కాలరాసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆక్షేపించారు. మత ఉద్రిక్తతలు నెలకొన్న ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాకు వెళ్లేందుకు తన సోదరి ప్రియాంకతో కలిసి ఆయన చేసిన ప్రయత్నాన్ని పోలీసులు వమ్ముచేశారు. ఢిల్లీ – యూపీ సరిహద్దుల్లోని ఘజియాబాద్ వద్ద వారిని అడ్డుకుని వెనక్కి పంపించివేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు రాహుల్ తన కాన్వాయ్‌తో ఘజియాబాద్ వరకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ పెద్దఎత్తున మోహరించిన పోలీసులు జాతీయ రహదారిని బారికేడ్‌లతో మూసివేశారు. రాహుల్ తన వాహనంలోంచి దిగి సీనియర్ పోలీసు అధికారులతో మాట్లాడినా.. ప్రయోజనం లేకపోయింది. దీంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తన పర్యటనను పోలీసులు అడ్డుకోవడం తన రాజ్యాంగ హక్కులను హరించడమేనని రాహుల్ ఆక్షేపించారు. ‘‘సంభాల్‌కు వెళ్లకుండా పోలీసులు నన్ను అడ్డుకున్నారు. కార్యకర్తలు వెంట లేకుండా ఒక్కడినే అక్కడకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పాను. అయినా, పోలీసులు అంగీకరించలేదు. ఒక విపక్ష నేతగా సంభాల్‌లో పర్యటించడం నా విధి.. రాజ్యాంగ హక్కు. ఆ హక్కును పోలీసులు హరించారు. నా పర్యటనను చూసి ఎందుకు బీజేపీ భయపడుతోంది’’ అని రాహుల్ విమర్శించారు.
