మే 16, (నేటి తెలుగు పత్రిక): ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఇంధన పొదుపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సౌరశక్తి వినియోగాన్ని పెంచి ప్రజల విద్యుత్ ఖర్చులు తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.సూర్యఘర్ కార్యక్రమంలో భాగంగా దేశంలోనే అత్యధికంగా ఏపీలో 20 లక్షల సోలార్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. పేద కుటుంబాలకు ఒక్కో ఇంటిపై 2 కిలోవాట్ల సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.2 కిలోవాట్ల సోలార్ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం రూ.60 వేల సబ్సిడీ, 3 కిలోవాట్లకు రూ.78 వేల వరకు అందిస్తోందని తెలిపారు. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 2 కిలోవాట్ల యూనిట్‌పై మొత్తం రూ.1.25 లక్షల వరకు సబ్సిడీ అందించేలా సీఎం ఆదేశించారని చెప్పారు.ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆస్పత్రులపై కూడా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి పెంచే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. శిలాజ ఇంధనాలపై ఆధారాన్ని తగ్గించి క్లీన్ ఎనర్జీ వినియోగాన్ని పెంచడం ద్వారా ప్రజలపై భారం తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి పేర్కొన్నారు.గత రెండు సంవత్సరాలుగా విద్యుత్ చార్జీలు పెంచకుండా ప్రభుత్వం భారం భరిస్తోందని, భవిష్యత్తులో కూడా ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను తక్కువ ఖర్చుతో అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
