పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పొడిగింపు: విద్యార్థులకు ఏపీ బోర్డ్ సువార్త
అమరావతి, డిసెంబర్ 25:
మార్చి-2025లో నిర్వహించే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లించడానికి మరో అవకాశం కల్పించింది ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా బోర్డ్. వివిధ కారణాల వల్ల ఫీజు చెల్లించని విద్యార్థుల కోసం తత్కాల విధానం కింద గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
పరీక్షల విభాగం సంచాలకులు కేవీ శ్రీనివాసులు రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తత్కాల విధానం కింద విద్యార్థులు రూ.1000 అపరాధ రుసుముతో డిసెంబర్ 27 నుండి జనవరి 10 వరకు పరీక్ష ఫీజును చెల్లించవచ్చని సూచించారు.
ఈ నిర్ణయం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, పరీక్షల సమయంపై మరిన్ని వివరాలను సంబంధిత స్కూల్ యాజమాన్యాలు విద్యార్థులకు తెలియజేస్తాయని బోర్డ్ ప్రకటించింది.