మే 18, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలోని పొగాకు, ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖలు రాశారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్‌కు పంపిన లేఖల్లో రైతుల ఇబ్బందులను వివరించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.సిగరెట్లపై కేంద్రం అమలు చేస్తున్న కొత్త పన్నుల విధానం కారణంగా వర్జీనియా పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సీఎం పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పొగాకు ధరలు గణనీయంగా పడిపోయాయని తెలిపారు. కొనుగోలు సంస్థలు పరిమితులు విధించడంతో రైతులకు గిట్టుబాటు లేకుండా పోయిందన్నారు.అంతర్జాతీయ పరిస్థితులు, ఎగుమతుల మందగమనం వల్ల కూడా పొగాకు రంగం సంక్షోభంలోకి వెళ్లిందని సీఎం వివరించారు. రాష్ట్రంలో వేలాది మంది రైతులతో పాటు లక్షలాది మంది కార్మికుల జీవనోపాధి ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పొగాకుపై పన్నుల విధానాన్ని పునఃసమీక్షించాలని కేంద్రాన్ని కోరారు.ఇక ఆక్వా రంగంపై అమెరికా విధిస్తున్న భారీ సుంకాలు రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని చంద్రబాబు మరో లేఖలో పేర్కొన్నారు. రొయ్యల ఎగుమతులపై పెరిగిన పన్నుల ప్రభావంతో వేల కోట్ల రూపాయల ఎగుమతులు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు.ఆక్వా రంగంపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని సీఎం తెలిపారు. దేశీయ మార్కెట్‌లో కూడా రొయ్యల ధరలు భారీగా పడిపోయాయని చెప్పారు.ఆక్వా రైతులకు అండగా నిలిచేందుకు ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని, అదనపు మత్స్య పరిశోధనా సంస్థను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని చంద్రబాబు కోరారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
