Breaking News

జైళ్లలో సంస్కరణలు తీసుకొస్తాం: హోంమంత్రి అనిత

మే 18, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర జైళ్ల శాఖలో సమగ్ర ప్రక్షాళన చేపడతామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఖైదీల్లో సత్ప్రవర్తన, మార్పు తీసుకురావడమే జైళ్ల అసలు ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు.తిరుపతిలోని స్పెషల్ సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేసిన హోంమంత్రి, అక్కడ ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జైలులో ఖైదీల సంఖ్య సామర్థ్యాన్ని మించిపోయిందని ఆమె వెల్లడించారు.ప్రస్తుతం 120 మంది ఉండాల్సిన చోట 140 మందికి పైగా ఖైదీలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. జైలు విస్తీర్ణం కూడా చాలా తక్కువగా ఉందని, దీన్ని విస్తరించాలా లేదా కొత్త ప్రదేశంలో నిర్మాణం చేపట్టాలా అనే అంశంపై ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. ఖైదీల భద్రత ప్రభుత్వ బాధ్యత అని, వారిలో పరివర్తన తీసుకురావడంలో జైలు సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని అనిత చెప్పారు. పెరోల్‌పై బయటకు వచ్చే ఖైదీలపై కూడా ప్రత్యేక నిఘా ఉంచుతున్నామని వెల్లడించారు.రాష్ట్రంలో సంచలనాత్మక కేసుల విచారణ వేగవంతం చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పనిచేస్తున్నాయని హోంమంత్రి తెలిపారు. అవసరమైతే మరిన్ని ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.అలాగే పోలీస్, ఫైర్, జైళ్ల శాఖల్లో ఖాళీల భర్తీ ప్రక్రియను జాబ్ క్యాలెండర్ ద్వారా వేగంగా చేపడుతున్నామని పేర్కొన్నారు. జైళ్ల నిర్వహణలో పారదర్శకత, భద్రత, సంస్కరణలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *