మే 23, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో సినిమా ప్రదర్శన రంగంలో మరోసారి వివాదం రాజుకుంది. థియేటర్ల నిర్వహణలో ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులు, తగ్గుతున్న ఆదాయాల నేపథ్యంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విడుదలయ్యే ప్రతి సినిమాకు పర్సెంటేజ్ విధానం అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ముఖ్యంగా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న “పెద్ది” సినిమాకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని ప్రకటించడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సభ్యులు నిర్మాతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కమిటీతో రెండు మూడు దఫాలు చర్చలు జరిపామని, “హరిహర వీరమల్లు” సినిమా విడుదల సమయానికి రెండు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఏడాది గడిచిపోయినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మండిపడ్డారు.ప్రస్తుతం థియేటర్ యజమానుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని అసోసియేషన్ పేర్కొంది. గతంలో థియేటర్లకు స్థిరమైన ఆదాయం ఉండేదని, కానీ ఇప్పుడు ఖర్చులు పెరిగిపోయి ఆదాయం తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీలు, నిర్వహణ వ్యయాలు, సిబ్బంది జీతాలు పెరుగుతున్నప్పటికీ టికెట్ ఆదాయం మాత్రం సరిపోవడం లేదని చెప్పారు.ఇక నిర్మాతలకు మాత్రం సినిమాల ద్వారా అనేక మార్గాల్లో ఆదాయం వస్తోందని ఎగ్జిబిటర్లు ఆరోపించారు. ఓటీటీ హక్కులు, శాటిలైట్ రైట్స్, డిజిటల్ స్ట్రీమింగ్, ఆడియో హక్కులు, విదేశీ విడుదలలు, బ్రాండ్ ప్రమోషన్లు వంటి పలు వనరుల ద్వారా నిర్మాతలు లాభాలు పొందుతున్నారని పేర్కొన్నారు. కానీ సినిమా ప్రదర్శించే థియేటర్ యజమానులకు మాత్రం సరైన వాటా దక్కడం లేదని వాపోయారు.
“పర్సెంటేజ్ విధానం కొత్తది కాదు.. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉంది. తెలంగాణలో కూడా అదే విధానం అమలు చేస్తేనే థియేటర్లకు ఊరట లభిస్తుంది” అని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. నిర్మాతలు కావాలనే ఈ నిర్ణయాన్ని ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు.ప్రస్తుతం 120కి పైగా థియేటర్ యజమానులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే చాలా థియేటర్లు మూతపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. “మాకు ఎంత శాతం ఇస్తారో స్పష్టంగా చెప్పాలి. రెంటల్ విధానం వద్దు.. పర్సెంటేజ్ విధానమే కావాలి” అని డిమాండ్ చేశారు.“పెద్ది” సినిమా విడుదల విషయంలో కూడా తాము రాజీపడబోమని ఎగ్జిబిటర్స్ స్పష్టం చేశారు. పర్సెంటేజ్ ఒప్పందంపై సంతకాలు చేస్తేనే సినిమా విడుదలకు సహకరిస్తామని పేర్కొన్నారు. ఇదే అంశంపై సబ్ కమిటీలో కూడా తమ వాదన బలంగా వినిపిస్తామని చెప్పారు.సినీ పరిశ్రమలో ఉన్న పెద్దలు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి వంటి ప్రముఖులు ముందుకు వచ్చి చర్చలు జరిపితే తమ సమస్యలు వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పరస్పర అవగాహనతో ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.ఈ పరిణామం నేపథ్యంలో రాబోయే రోజులలో తెలుగు సినీ పరిశ్రమలో పర్సెంటేజ్ విధానంపై పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా పెద్ద సినిమాల విడుదలల సమయంలో ఈ అంశం మరింత కీలకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
