రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో అక్రమ తవ్వకాలు జరుపుతున్న దృశ్యం
రిజర్వ్ ఫారెస్ట్,రెవెన్యూ భూముల్లో ప్రకృతి ఖనిజ సంపదను కొల్లగొడుతున్న అక్రమార్కులు
ముడుపుల మత్తులో మైనింగ్,నిద్రావస్థలో రెవిన్యూ శాఖ
కబ్జాకు గురవుతున్న అటవీ, అసైన్డ్ భూములు, దోపిడీ అవుతున్న ప్రకృతి సంపద
కొండలను పిండి చేస్తున్న అక్రమార్కులు.
చోద్యం చూస్తున్న అధికారులు
ఎ.కొండూరు మార్చి 30 (నేటి తెలుగు పత్రిక): లక్షలాది రూపాయల విలువ చేసే ప్రకృతి ఖనిజసంపదను కొందరు అక్రమార్కులు తాత్కాలికంగా మైనింగ్ లైసెన్స్ పొంది గుట్టుచప్పుడు కాకుండా కొల్లగొడుతున్న ప్పటికీ రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు చోద్యం చూస్తున్నారని మండల ప్రాంత ప్రజలు విమర్శిస్తున్నారు. అధికారుల కనుసన్నల్లో అక్రమ క్వారీ పనులు ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ అంటీ ముట్టని నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ అక్రమార్కులకే వత్తాసు పలుకుతున్నారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు.ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలంలోని అట్లప్రగడ గ్రామ సమీపంలోని రెవెన్యూ ఫారెస్ట్ భూమిలో,గంపలగూడెం మండలం అనుముల్లంక కనుమూరు గ్రామాల సమీపంలోని మామిడి తోటలో,కృష్ణారావు పాలెం గ్రామ సమీపాన జాతీయ రహదారి పక్కనే గల భూమిలో, రెడ్డిగూడెం మండలం కుదప, రుద్రవరం గ్రామాల సమీపాన,మైలవరం,జి కొండూరు విజయవాడ, వివిధ రాష్ట్రాలకు చెందిన కొందరు బడా బాబులు తక్కువ ధరకు భూములు లీజుకు తీసుకొని మైనింగ్ అధికారులవద్ద తాత్కాలికంగా లైసెన్స్ పొంది అక్రమ తెల్ల పలుగురాయి క్వారీలను నడుపుతూ కోట్లాది రూపాయలుగడుస్తున్నారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి అక్రమ క్వారీలను ఏర్పాటుచేసి లక్షలాది రూపాయలు లాభాలు గడిస్తున్నారని బాధిత రైతులు తెలిపారు. పరిమితికి మించి లోతులో అక్రమ తవ్వకాలు, బ్లాస్టింగ్ చేస్తుండటం వల్ల వ్యవసాయ బోర్లలో నీరు ఇంకి పోవటమే కాకుండా పంట పొలాల్లోని వ్యవసాయ బోర్లు అడుగంటి పంటలకు చుక్కనీరు అందకపోవడం వల్ల రైతులు ఆరుగాలం కష్టించి సాగుచేసిన పంటలన్నీ చేతికి అందకుండా పోతున్నాయని తెలిపి వాపోయారు. బ్లాస్టింగ్ సమయంలో పెద్ద పెద్ద రాళ్ళు పైకెగిసి పడుతుండటం వల్ల పశువులు,మూగజీవాలు వాటి బారిన పడి ప్రమాదాలకు గురవుతున్నాయని కాపరులు తెలిపి కంటతడి పెట్టారు.
సన్న చిన్నకారు రైతులకు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని రైతులు తెలిపి వాపోయారు. గ్రామ పంచాయితీలకు సంబంధించిన లావెల్టీ కూడా చెల్లించడం లేదని తెలిసింది.తవ్వకాలతో గట్లు పోరంబోకు భూములు కనుమరుగవుతున్నాయని ప్రభుత్వ సంపదను కొల్లగొట్టడంవల్ల పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. మండలంలోని అక్రమార్కులు ప్రభుత్వం రిజర్వ్ ఫారెస్ట్, అసైన్డ్, రైతుల పట్టా భూములను లీజుకు తీసుకొని అక్రమ మైనింగ్ క్వారీలను ఏర్పాటుచేసి చెన్నై,కాకినాడ, విశాఖపట్నం తదితర పట్టణాలకు తరలించి కోట్లాది రూపాయలు గడిస్తున్నారని రైతులు తెలిపారు.ఈ అక్రమ వ్యాపారాన్ని నివారించే వ్యవస్థ కనుచూపు మేరలో కనిపించకపోవడంతో వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయల్లాగా విరాజిల్లుతోందన్నారు. అక్రమ మైనింగ్ వ్యాపారానికి కొందరు రాజకీయ నాయకుల, ప్రజా ప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉండటంతో వీరి వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుందన్నారు. తెల్ల పలుగురాయి తరలించే సమయంలో భారీ వాహనాల రాకపోకల వలన ఎన్ఎస్ పి కాలువ ధ్వంసం అవ్వటమే కాకుండా కాలువపై ఉన్న వంతెన కుప్పకూలే అవకాశాలు ఉన్నాయన్నారు. ఎన్ఎస్ పి కాలువపై అక్రమ వ్యాపారాలు భారీ వాహనాలు నడపకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ, అక్రమార్కులు నిబంధనలను తుంగలో తొక్కి తమ వ్యాపారాన్ని దర్జాగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ప్రకృతి ఖనిజ సంపదను కొల్లగొడుతున్న అక్రమార్కులపై చర్యలు తీసుకొని పర్యావరణాన్ని కాపాడాలని మండల ప్రాంత ప్రజలు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేస్తున్నారు.

