సంక్రాంతి సంబురాల్లో మోహన్ బాబు సందడి: వివాదాల మధ్య వినోదం
సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు (Mohan Babu) కుటుంబ వివాదాలు, జర్నలిస్టుపై దాడి కేసులతో సతమతమవుతుండగానే సంక్రాంతి వేడుకల్లో పాల్గొని కాస్తా విశ్రాంతి తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలోని తన విద్యా సంస్థ విద్యానికేతన్ ప్రాంగణంలో జరిగిన సంక్రాంతి సంబురాల్లో మోహన్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేశారు.
కాగా, ఓ జర్నలిస్టుపై దాడి కేసు నేపథ్యంలో కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న మోహన్ బాబు ఈ వేడుకల్లో ప్రత్యక్షమవ్వడం ఆసక్తి కలిగించింది. ఆయన కూతురు మంచు లక్ష్మి కూడా ఈ వేడుకల్లో పాల్గొని, కుటుంబంతో కలిసి సందడిని పెంచారు.
మోహన్ బాబు పైన నమోదైన దాడి కేసులో, ఆయన ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, కోర్టు దీనిని నిరాకరించింది. ఆ తర్వాత అరెస్టు భయంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 78 ఏళ్ల వయస్సు, గుండె సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోరారు.
ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించినప్పటికీ, మోహన్ బాబుకు తరఫు న్యాయవాది ముకుల్ రోహతి అందుబాటులో లేకపోవడంతో, ఆయన న్యాయవాది పాస్ ఓవర్ కోరారు. దీంతో కోర్టు ఈ కేసు విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.
మరోవైపు, మోహన్ బాబు సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం, కుటుంబంతో సంతోషంగా గడపడం అభిమానులను అలరించింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఈ వివాదం ఎటువైపు మళ్లుతుందనేది ఆసక్తిగా మారింది.