ఏడాది పాలనలో రూ.1,27,208 కోట్ల అప్పు చేశింది కాంగ్రెస్ ప్రభుత్వం: హరీశ్‌రావు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
“రాజకీయ విమర్శలు కాదు.. ఇది ఆర్‌బీఐ రిపోర్ట్”
హరీశ్‌రావు మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్‌బీఎం (FRBM) కింద తీసుకున్న అప్పులు రూ.51,277 కోట్లు. అయితే ఈ రోజు ఉదయం నేను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రిపోర్టు పరిశీలించాను. తాజా లెక్కల ప్రకారం మరో రూ.3 వేల కోట్లు అదనంగా అప్పుగా చేర్చబడింది. అంటే మొత్తం రూ.55,277 కోట్లు ఎఫ్ఆర్‌బీఎం కింద తీసుకున్నట్లు స్పష్టమవుతోంది” అని వివరించారు.
అప్పుల మొత్తం రూ.1,27,208 కోట్లు
అంతేకాకుండా, కార్పొరేషన్ గ్యారెంటీల కింద రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.61,991 కోట్లు అప్పు చేసినట్లు చెప్పారు. అదనంగా గ్యారెంటీలేమీ లేకుండా రూ.10,099 కోట్లు తీసుకున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో తీసుకున్న అప్పు మొత్తం రూ.1,27,208 కోట్లు అని వెల్లడించారు.
“5 ఏళ్లలో రూ.6.36 లక్షల కోట్లు?”
హరీశ్‌రావు హెచ్చరిస్తూ, “ఇలాగే కొనసాగితే వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రం రూ.6,36,040 కోట్ల అప్పుల్లో కూరుకుపోతుంది. ఈ విధానం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత దెబ్బతీస్తుంది” అని అన్నారు.
ఆర్థిక మంత్రి భట్టి ప్రకటన:
తాజా అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.52 వేల కోట్లు మాత్రమే అప్పు తీసుకుందని వివరణ ఇచ్చారు. అయితే ఈ లెక్కలపై హరీశ్‌రావు పలు ఆధారాలు చూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఆర్థిక పరిస్థితిపై హోరాహోరీ వాదనలు:
అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పుల అంశం తీవ్ర చర్చకు దారితీసింది. హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలకు అధికారపక్షం నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఆర్థిక పరిస్థితిపై ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది.