విజయ్ మాల్యా ఆస్తులను అమ్మి 14 వేల కోట్లు బ్యాంకులకు జమ – కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన
లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఆమె మాట్లాడుతూ, బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థుల నుంచి ఈ ఏడాది ₹22,280 కోట్లు రాబట్టినట్లు వెల్లడించారు.
ఆర్ధిక నేరస్థులలో పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు చెందిన దేశంలో ఉన్న ఆస్తులను వేలం వేసి ₹14,000 కోట్లు బ్యాంకుల్లో జమ చేసినట్లు మంత్రి వివరించారు. అలాగే, గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ నుండి ₹1,000 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు.
మిగతా ఎగవేతదారుల నుంచి ₹7,000 కోట్లు వసూలు చేసి, మొత్తం ₹22,280 కోట్లు వివిధ బ్యాంకులకు జమ చేశామని మంత్రి వెల్లడించారు. ఈ మేరకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరియు బ్యాంకులు సంయుక్తంగా ముంబైలోని స్పెషల్ కోర్టును ఆశ్రయించాయి.
అటు, మరొక వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి చెందిన ₹2,566 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందని, ఈ ఆస్తులను కూడా స్పెషల్ కోర్టు అనుమతితో వేలం వేసే చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తీసుకున్న ₹13,000 కోట్ల పైగా రుణాలను చోక్సీ తిరిగి చెల్లించకపోవడంతో, ఈడీ జప్తు చేసిన ఆస్తులను స్పెషల్ కోర్టు ఆదేశాలతో విక్రయించి, బ్యాంకులకు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.