Breaking News

ఎబోలా కలకలం.. ప్రపంచవ్యాప్తంగా అప్రమత్తం చేసిన డబ్ల్యూహెచ్‌వో

మే 17, (నేటి తెలుగు పత్రిక): ఆఫ్రికా దేశాలైన కాంగో, ఉగాండాలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. పెరుగుతున్న కేసులు, మరణాల నేపథ్యంలో అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. అయితే ఇది కరోనా తరహా మహమ్మారి కాదని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేయడం కొంత ఊరటనిచ్చింది.డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 300కు పైగా అనుమానిత ఎబోలా కేసులు నమోదయ్యాయి. వీరిలో కనీసం 88 మంది మృతిచెందినట్లు సమాచారం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వైరస్ వ్యాప్తి చెందుతున్న సంకేతాలు కనిపిస్తుండటంతో ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈసారి వ్యాపిస్తున్న వైరస్ సాధారణ ఎబోలా వేరియంట్ కాదని, ‘బుండిబుగ్యో’ అనే అరుదైన వేరియంట్ కారణమని అధికారులు గుర్తించారు. ఈ వేరియంట్‌కు ఇప్పటివరకు పూర్తిస్థాయి వ్యాక్సిన్ లేదా ప్రత్యేక చికిత్స అందుబాటులో లేకపోవడం ప్రపంచ ఆరోగ్య సంస్థను మరింత అప్రమత్తం చేసింది. ప్రస్తుతం ఉన్న కొన్ని వ్యాక్సిన్లు ఇతర ఎబోలా వేరియంట్లపై పనిచేస్తున్నప్పటికీ.. బుండిబుగ్యోపై ప్రభావం పరిమితంగానే ఉందని నిపుణులు చెబుతున్నారు.అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. కరోనా సమయంలో అమలు చేసినట్లుగా అంతర్జాతీయ ప్రయాణాలపై పూర్తిస్థాయి ఆంక్షలు లేదా సరిహద్దుల మూసివేత అవసరం లేదని పేర్కొంది. కానీ ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిఘా పెంచాలని, ఆరోగ్య పరీక్షలను కట్టుదిట్టం చేయాలని సభ్య దేశాలకు సూచించింది.ఎబోలా వైరస్ సాధారణంగా సోకిన వ్యక్తుల రక్తం, శరీర ద్రవాలు, సన్నిహిత సంబంధాల ద్వారా వ్యాపిస్తుంది. జ్వరం, తీవ్ర అలసట, వాంతులు, విరేచనాలు, అంతర్గత రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స ఆలస్యమైతే మరణాల రేటు అధికంగా ఉండటం వల్ల ఈ వైరస్ అత్యంత ప్రమాదకరంగా భావిస్తారు.‘బుండిబుగ్యో’ వేరియంట్ తొలిసారిగా 2007లో ఉగాండాలో వెలుగులోకి వచ్చింది. అప్పట్లో 37 మంది మృతిచెందగా.. 2012లో కాంగోలో మరోసారి వ్యాపించి 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ ఈ వేరియంట్ వెలుగులోకి రావడం ప్రపంచ ఆరోగ్య వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.ఇప్పటికే కాంగో, ఉగాండా ప్రభుత్వాలు అత్యవసర చర్యలు ప్రారంభించాయి. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి, ఇంటింటి సర్వేలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య సిబ్బందికి ప్రత్యేక రక్షణ పరికరాలు అందజేస్తున్నారు. డబ్ల్యూహెచ్‌వో కూడా వైద్య నిపుణుల బృందాలను అక్కడికి పంపింది.భారతదేశం సహా పలు దేశాలు ఆఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై వైద్య పరీక్షలను కట్టుదిట్టం చేసే అవకాశముంది. కేంద్ర ఆరోగ్య శాఖ కూడా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం భయపడాల్సిన అవసరం లేదని.. కానీ అప్రమత్తత మాత్రం తప్పనిసరి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ప్రపంచ సవాళ్ల మధ్య భారత్ పురోగతి కొనసాగుతోంది: మోదీ

తెలంగాణలో పెట్టుబడులపై కేటీఆర్‌తో ఆస్ట్రేలియా ప్రతినిధుల చర్చ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *